telanganakeratam.in
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 1:44 pm Posted by : TELANGANA KERATAM

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా..

ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ..

విధి లేని పరిస్థితిలో పార్టీని వీడుతున్నా..

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉద్వేగభరిత వ్యాఖ్యలు

జీవన్ రెడ్డి వెంటే ఉంటామని ముక్తకంఠంతో నినదించిన కార్యకర్తలు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మార్చి 24 : ఎట్టకేలకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ముందుగా కాంగ్రెస్ కండువా వేసుకొని, జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ నుండి అభిమానులు, కార్యకర్తలు, నాయకుల నినాదాల మధ్య స్థానిక జంబి హనుమాన్ ఆలయం వరకు కాలినడక వెళ్ళి కొబ్బరికాయ కాయ కొట్టి, పూజలు నిర్వహించి, స్థానిక బండారి గార్డెన్ వరకు వాహనంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభిమానులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విధి లేని పరిస్థితిలో పార్టీని వీడుతున్నానని తెలిపారు. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ అనుభవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల అనుబంధం వదులుకోవాలని ఎవరు కోరుకోరని అన్నారు. విధి లేని పరిస్థితిలో నిర్ణయం తీసుకున్నానని, నా ఈ స్థాయికి మిత్రులు, అభిమానులు, నాయకులు కార్యకర్తలు తోడ్పడ్డారని పేర్కొన్నారు. 1984 లో కాంగ్రెసు పార్టీలో చేరానని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలవడం ఓడటం సహజం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యతకు చిహ్నంగా ఉండేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితిలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు నిదర్శనం అన్నారు. 1996 శాసన సభ ఉప ఎన్నికల్లో 01 లక్ష ఓట్లు పోలైతే 54 వేల మెజార్టీతో గెలుపొందానన్నారు. ఉప ఎన్నికల్లో 73 శాతం ఓట్లతో గెలుపొందిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కెసిఆర్ పై 2006, 2008 పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీ చేశానని, 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుపొందితే, ఉత్తర తెలంగాణ జలాల్లో ఏకైక శాసన సభ్యుడిగా ఎన్నికయ్యనని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుకను వినిపించానన్నారు. 2018 లో ఎమ్మెల్యేగా ఓడినా, 2019 ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీగా గెలుపొందానన్నారు. శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా ఒంటరి పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు, ఒకటి సీపీఐ 07 గురు ఎంఐఎం సపోర్ట్ ఉండగా.. మెజారిటీ ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ పది స్థానాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిందన్నారు. దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికి మళ్ళీ పార్టీలో స్థానం కల్పించారన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులను దోచుకన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి లేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.. మీ హక్కులకు భంగం కలుగనివ్వమని కేసి వేణుగోపాల్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారని తెలిపారు. జగిత్యాల మార్కెట్ కమిటీ మారు గంగారెడ్డి, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి నియామకంలో అందరూ ఏకాభిప్రాయం తెలిపారని, సీఏం రేవంత్ రెడ్డిని కలసి మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రతిపాదనలు అందజేయాగా వేం నరేంద్ర రెడ్డిని అప్పగించారని, ఈ విషయమై ఏమైంది అని అడిగితే నాది ఏముందీ నాది పోస్ట్ మాన్ ఉద్యోగం సిఎం ఏది చెప్తే ఆది చేస్తానని అన్నారని తెలిపారు. సీఏం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల కోసం రెండో ప్రతిపాదన చేశారని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి నాకు అండగా నిల్చిన నాయకుడు అతి కిరాతకంగా హత్యకు గురైతే నేను స్పందించలా వద్దా.. అని ప్రశ్నించారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నది బజారులో చంపబడితే కనీసం సిఎం రేవంత్ రెడ్డి ఏం జరిగింది అని కూడా అడుగలేదన్నారు. నా స్థాయి ముఖ్యమంత్రి ఓదార్పు కోరునుకే స్థాయి కాదా..అని నిలదీశారు. కార్యకర్తల శ్రమతో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, కనీసం కార్యకర్తకు అండగా నిలవాలా..వద్దా… అని ప్రశ్నించారు. ఈ బాధ జీర్ణించుకోలేక ఏఐసీసీకి లేఖ రాశానన్నారు. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలువలసిన నైతిక బాధ్యత లేదా అని అడిగారు. మార్కెట్ కమిటీ ప్రతిపాదన నిలుపకుండా నియామకం చేపడితే బతికి ఉండేవారేమోనని, గంగారెడ్డి మరణంలో నాది బాధ్యత ఉంది అని భావిస్తున్నానన్నారు. రెండేళ్లు గడుస్తుందని మార్కెట్ కమిటీ నియామకం అయితే ఒక టర్మ్ పూర్తి అయ్యేదని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అడ్లూరి లక్ష్మణ్ సాక్షిగా ఉత్తర్వులు జారీ చేయమని చెప్పిన తర్వాత కూడా అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. కార్యకర్తలు బలి అవుతుంటే వారికి అండగా నిలవకపోతే పార్టీలో ఏవిధంగా కొనసాగటం అని అడిగారు. దేవాలయాల కమిటీలో, ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో కూడా మాకు కనీసం సమాచారం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అరచకం చేసిన పోలీస్ యంత్రాంగంను మళ్ళీ తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాది అని భావన ఉండాల వద్దా అని అడిగారు. ఒకవైపు స్పీకర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిరాయింపు విచారణలో ఉండగా, గాంధీ భవన్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహ రచన సమావేశంలో ఎమ్మెల్యే సమావేశం కావడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాహుల్ గాంధీ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే నినాదంతో ముందుకు వెళ్తుంటే, ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద పోటీ చేయడం దేనికి సంకేతం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీఏం రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గంలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఈ వయసులో నాకు బయటకు వెళ్లలని లేదన్నారు. పీసిసి అధ్యక్షుడు మహిష్ కుమార్ గౌడ్ కల్సి ప్రయాణం చేద్దాం అంటారు..20 నెలలుగా నన్ను కించపరుస్తూ.. అడుక్కునే స్థాయికి తీసుకువస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. మొన్నటి వరకు ప్రభుత్వం మాత్రమే ఎమ్మెల్యేకు అండగా ఉంది అనుకున్నానని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా జతగా మారిందన్నారు. ఇక మిగిలింది ఏముంది..పదవులు ఇచే శక్తి లేకున్న.. కానీ ఆత్మ గౌరవం కాపాడాల వద్దా అని అడిగారు. మీనాక్షి నటరాజన్ 80 శాతం మీకే ప్రాధాన్యత ఉంటుందని హమీ ఇచ్చారన్నారు. శాసన మండలిలో ఒంటరి పోరాటం చేసిన నేను మంత్రి పదవికి అర్హుడిని కాదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని, పిసీసి అధ్యక్షుడిగా నన్ను సోనియా గాంధీ నిర్ణయించుకున్న తర్వాత మారుతుందా అని అడిగారు. పెట్టుబడి దారులు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఉన్నాయని వాయిదా వేశారని, పీసీసి అధ్యక్ష స్థాయి వ్యక్తిని నియోజకవర్గంలో నా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఎదగకుండా అణగదొక్కాలని రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. ఎదిరించి పోరాటం చేయం నాకు కొత్త కాదని, చంద్రబాబును, కెసిఆర్ ను ఎదిరించి పోరాటం చేశానని, రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తానన్నారు. ఎదిరొస్తే పోయేది ఏముంది.. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ అనుభవించాలని ప్రశ్నించారు. నీ అడుగులకు మడుగులు ఒత్తెవారు కావాలి మీకు ఎదిరించే వారు వద్దని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేవాడిని అణగదొక్కుంటున్నారని పేర్కొన్నారు. వేం నరేంద్ర రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. చిన్న రెడ్డినీ తనకు జరిగిన అవమానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాది..అడ్డు వస్తే తొక్కుత అంటున్నారు…ఎంత మందిని తొక్కుతారు అని నిలదీశారు. మమ్మల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా అండగా నిల్చిన కార్యక్తలు నాకు తోడుగా నిలవాలని కోరారు. దేవుడు అవకాశం ఇస్తే జగిత్యాలను జాతీయ స్థాయిలో గుర్తు వచ్చేలా అభివృద్ధి చేస్తానన్నారు. రెండేళ్లు అవమానాలతో గడిచిపోయిందని, మిగిలిన రెండేళ్లు పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. మన హక్కుల కోసం, ధర్మ కోసం పోరాటం చేద్దాం..నాకు అండగా నిలువండి అని విజ్ఞప్తి చేశారు. నేను అనుభవించిన మానసిక క్షోభను వ్యక్తం చేశానని, నేను ముఖ్యమంత్రిని కావలనీ కోరుకోలేదన్నారు. మీ తొక్కుడు భరించలేక స్వేచ్ఛ కోరుకుంటున్నా..మమ్మల్ని బతుకన్నివ్వండి అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల రక్షిస్తారని కోరుకుంటున్నానన్నారు. నా తోడు నిలిచేందుకు ముందుకు వచ్చే వారందరూ చేయి ఎత్తాలని పిలుపునివ్వగా, అభిమానులు, నాయకులు నినాదాలు చేస్తూ చేయి ఎత్తి మద్దతు తెలిపారు. రాజీనామా పత్రం విడుదల చేసి, కాంగ్రెస్ పార్టీ కండువా తీసేసి, ఆకు పచ్చ కండువా మెడలో కప్పుకున్నారు. కార్యకర్తలు.. అభిమానులు.. నాయకులు మాట్లాడుతూ..జీవన్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తాం..జీవన్ రెడ్డి వెంటే నడుస్తాం అని అన్నారు. జగిత్యాలలో మరో జైత్ర యాత్ర మొదలవుతుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జీవన్ రెడ్డిని అవమానించిన తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ కి రాజీనామా చేస్తున్నామన్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలుస్తూ, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన జీవన్ రెడ్డికి మద్దతు నిలుస్తామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వీడడం అంటే ఎంత బాధ ఉంటే వీడుతామో తెలుసుకోవాలని అన్నారు. జీవన్ రెడ్డి వెంట ఉండి సైనికులుగా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన జీవన్ రెడ్డిని అవమాన పరుస్తూ, పార్టీ నుండి వెళ్ళిపోయేలా చేసిన వారికి అదే గతి పడుతుందన్నారు. 40 ఏళ్ల అనుబంధాన్ని తెగ్గిసిన వారికి అదే గతి పడుతుందని, కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయిందన్నారు. జీవన్ రెడ్డి వెంటే ఉంటాం..జీవన్ రెడ్డి ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. పదవులు కాదు.. ఆత్మ గౌరవమే ముఖ్యం అన్నారు జీవన్ రెడ్డి పార్టీని వీడి పోవడంపై కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పతనం జగిత్యాల నుండే ప్రారంభం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నీ కుటుంబంగా భావించామని, ఓపిక నశించి పార్టీ వీడాల్సి వస్తుందన్నారు. జగిత్యాల జిల్లా మండల అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఉప సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, జిల్లా ఫిషరీస్ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, వందలాది మంది కార్యకర్తలు, సర్పంచులు, కౌన్సిలర్లు, బతికేపల్లి సర్పంచ్, మండల మాజీ అధ్యక్షులు, వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బీర్పూర్ మాజీ ఎంపీపీ, యూత్ కాంగ్రెస్ స్టేట్ జెనరల్ సెక్రటరీ పదవితోపాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. యూత్ కాంగ్రెస్ జగిత్యాల్ అసెంబ్లీ నియోజక వర్గం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగిత్యాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవికి, రాజీనామా.
రాష్ట్ర మహిళా కార్యదర్శి రాజీనామా చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.