తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 7:
జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారిని పక్కాగా ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పట్టణం ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి నుండి ఫేషియల్ నిర్ధారణ ప్రక్రియను యాప్ ద్వారా చేస్తామన్నారు. ఈ ప్రక్రియ ఈరోజు,రేపు మెదక్ పట్టణంలోని 7, 20, 21 ,22 వార్డుల్లో కొనసాగుతుందన్నారు. వార్డ్ ఆఫీసర్లు,మెప్మా సిబ్బంది నాలుగు బృందాలుగా ప్రక్రియలు చేపడుతుందన్నారు.నిర్ధారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మరణించిన వారిని పెన్షన్ పథకం నుండి తొలగించడానికి, పెన్షన్ పొందుతున్న వారిని నిర్ధారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ శ్రీనివాసరావు,సర్ఫ్ డైరెక్టర్ సోషల్ సెక్యూరిటీ గోపాల్, ప్రాజెక్టు మేనేజర్ గోవర్ధన్ టి. జి ఆన్లైన్, కృష్ణంరాజు,మృనాల్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.