🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:08 pm Posted by : KUKKALA RAJU

మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు

News Image
144 ఇళ్ల తనిఖీ.. 79 వాహనాలు సీజ్.. 15.66 లీటర్ల మద్యం స్వాధీనం మద్దూరు: నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీసులు మద్దూరు పట్టణంలోని అమర్‌గడ్డ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోస్గి సీఐ సైదులు ఆధ్వర్యంలో ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 65 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా కాలనీలోని 144 ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని, అనుమానాస్పదంగా ఉన్న 79 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 74 ద్విచక్ర వాహనాలు, నాలుగు త్రిచక్ర వాహనాలు, ఒక కారు ఉన్నాయి. అదేవిధంగా 15.66 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు పోలీసులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కోస్గి సీఐ సైదులు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని సీఐ సైదులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దూరు ఎస్సై విజయ్ కుమార్, దామరగిద్ద ఎస్సై నరేష్, కోస్గి ఎస్సై-2, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సంతోష్ నాయక్ రిపోర్టర్ | మద్దూర్
🏠 Home