🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 03 November 2026, 9:13 am Posted by : TELANGANA KERATAM

మిల్లర్లు, బియ్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి

News Image
 ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలి జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి 
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 02 జగిత్యాల జిల్లా పరిధిలోని రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని జగిత్యాల జిల్లా పౌరసరఫరాల అధికారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్కెట్‌లో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా పౌరసరఫరాల శాఖ క్షేత్రస్థాయి యంత్రాంగం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. వ్యాపారులు పాటించవలసిన ముఖ్య నిబంధనలను తెలియజేశారు. మిల్లులు, గోదాములు, దుకాణాలలో అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచరాదని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని తెలిపారు. ఎమ్మార్పీ లేబుళ్లను మార్చడం చట్టరీత్యా నేరం అని, బ్రాండెడ్ బ్యాగులలో తక్కువ నాణ్యత కలిగిన బియ్యాన్ని నింపి వినియోగదారులను మోసం చేయరాదని హెచ్చరించారు. నిర్దేశిత పరిమాణం ప్రకారం తూకం ఉండాలని, 26 కిలోల పేరుతో 24 లేదా 25 కిలోల బస్తాలను విక్రయిస్తే మోసపూరిత కొలతల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలోని ప్రతి రైస్ మిల్లు, హోల్‌సేల్, రిటైల్ షాపు ఎదుట స్పష్టంగా కనిపించేలా రోజువారీ నిల్వ వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన విక్రయ ధరల బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఆహార భద్రతా లైసెన్స్, రోజువారీ కొనుగోలు, అమ్మకాల వివరాలతో కూడిన స్టాక్ రిజిస్టర్ మెయింటెన్ చేయాలన్నారు. జిల్లాలోని డిప్యూటీ తహశీల్దార్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. షాపులు, మిల్లుల వద్ద ధరల బోర్డుల ప్రదర్శనను తనిఖీ చేయడంతో పాటు గోదాముల్లో నిల్వలను లెక్కించాలని స్పష్టం చేశారు. ఏదైనా మిల్లు లేదా దుకాణంలో అక్రమ నిల్వలు, ధరల ట్యాంపరింగ్, తూకంలో తేడాలు గమనించినా, రికార్డులు సక్రమంగా లేకున్నా సంబంధిత వ్యాపారులపై నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🏠 Home