🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:44 pm Posted by : TELANGANA KERATAM

పొగమంచు నేపథ్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:220కి పైగా వాహనాల తనిఖీ.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు రూ.1.20 లక్షల జరిమానాలు.
 కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.
చలికాలం నేపథ్యంలో ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉండటంతో రహదారి ప్రమాదాల నివారణకు, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.మంచిర్యాల, శ్రీరాంపూర్,సీసీ నస్పూర్,కేతనపల్లి, మంచిర్యాల బైపాస్ రోడ్డు,గద్దెరగడి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రాంగ్ పార్కింగ్ చేసిన లారీలు,ఇతర భారీ వాహనాలతో పాటు మొత్తం 220కి పైగా వాహనాలను తనిఖీ చేశారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మొత్తం రూ.1,20,000 జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ.. చలికాలంలో పొగమంచు కారణంగా రహదారిపై దృశ్యమానత తగ్గి, ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఇండికేటర్లు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపాలని,ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని, అతివేగానికి దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లు రహదారి పక్కన నిర్లక్ష్యంగా లేదా రాంగ్ పార్కింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. వాహనం మరమ్మతులకు గురైనప్పుడు రహదారిపై ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ఏసీపీ సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ఈ తనికిల్లో రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రావు,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home