🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 3:18 pm Posted by : TELANGANA KERATAM

ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు స్వాగతిస్తున్నాం.

News Image
 అదే విధంగా ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి: పడిగే ప్రశాంత్ ముదిరాజ్
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అదే విధంగా సుమారు 26 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజికవర్గానికి కూడా జనాభా ప్రాతిపదికన తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర యువత అధ్యక్షులు పడిగే ప్రశాంత్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి బీసీ కులానికి సమానమైన గౌరవం, అభివృద్ధి అవకాశాలు, ఆత్మగౌరవ భవనాలు, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గంగపుత్రులకు నిధులు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, ఇతర బీసీ కులాలకు కూడా వారి జనాభా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.సుమారు 6 లక్షల జనాభా ఉన్న గంగపుత్రులకు రూ.5 కోట్ల నిధులు కేటాయించిన నేపథ్యంలో, సుమారు 26 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రభుత్వం ఎంత మొత్తంలో నిధులు కేటాయిస్తుందో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. ముదిరాజుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు, ముదిరాజ్ కార్పొరేషన్ కు తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ముదిరాజులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజులను ప్రస్తుత బీసీ-D నుంచి బీసీ-Aలో చేర్చే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, ఈ ప్రక్రియను చట్టబద్ధమైన విధానాలు, అవసరమైన అధ్యయనాల ఆధారంగా వేగవంతం చేయాలని కోరారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాజ్ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ సామాజికవర్గ హక్కుల సాధన కోసం మరింత చొరవ చూపాలని అన్నారు. కేవలం ముదిరాజుల పేరుతో సమావేశాలు నిర్వహించడం, హామీలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.రాష్ట్రంలో ముదిరాజుల జనాభాకు అనుగుణంగా ఎమ్మెల్సీ తదితర రాజకీయ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ముదిరాజ్ యువతకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు.మా పోరాటం ఏ కులానికి వ్యతిరేకం కాదు.. మా పోరాటం ముదిరాజుల న్యాయమైన హక్కుల కోసమే. ఒక కులానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తే మరో కులం అసూయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సామాజికవర్గం అభివృద్ధి చెందాలి. ఎవరికీ అన్యాయం జరగకూడదు. అదే సమయంలో ముదిరాజులకు రావాల్సిన న్యాయమైన వాటా కూడా దక్కాలని ప్రశాంత్ ముదిరాజ్ స్పష్టం చేశారు.ముదిరాజుల ఆత్మగౌరవం, హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, బీసీ-A వర్గీకరణ సాధించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
🏠 Home