🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:54 am Posted by : TELANGANA KERATAM

కొడంగల్ లో ఒకే గదిలో మూడు క్లాసులు

News Image
_ సీఎం సొంత జిల్లాలోనే ప్రభుత్వ_ పాఠశాలలపై నిర్లక్ష్యం!_ తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు- వరండాల్లోనే చదువులు
 తెలంగాణ కెరటం తాండూర్ ప్రతినిధి: 
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని చెబుతున్న పాలకుల మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలోని తాండూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలకు కనీస తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.పట్టణంలోని 8వ వార్డు రాజీవ్, ఇందిరమ్మ కాలనీల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సరైన తరగతి గదులు, మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే గదిలో రెండు, మూడు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి బోధిస్తుండగా, మరికొన్ని తరగతులను వరండాల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఉంటే ఇక ప్రభుత్వ విద్యావ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాండూరులో కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణంపై చూపుతున్న ఆసక్తి, ప్రభుత్వ పాఠశాలలకు అదనపు గదులు నిర్మించడంపై ఎందుకు చూపడం లేదని స్థానిక ఎమ్మెల్యేను నిలదీశారు.విద్యార్థులకు సరైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని, కానీ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్ర మేల్కొని పాఠశాలల పరిస్థితిని పరిశీలించాలని కోరారు.రాజీవ్, ఇందిరమ్మ కాలనీల ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే అదనపు తరగతి గదులు నిర్మించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కౌన్సిలర్ జావిద్ డిమాండ్ చేశారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు
🏠 Home