🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 4:17 pm Posted by : Kancharala Shivakumar

చలి తీవ్రత పెరుగుతోంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. –దుబ్బాక వంద పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్

News Image
దుబ్బాకప్రతినిధి, నవంబర్ 14, తెలంగాణ కెరటం:రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్" హేమరాజ్ సింగ్ సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను వణికిస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. చెట్లు, గుట్టలు మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపిస్తూ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నప్పటికీ, చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా గ్రామాల్లో ఉదయం వేళ వీధి దీపాలను సైతం ఆలస్యంగా ఆర్పుతున్నారు.ఈ సందర్భంగా డాక్టర్" హేమరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ముఖ్యంగా ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.చలికాలంలో ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీటిని తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్స్ ధరించాలని, శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలని తెలిపారు. చిన్నారులు, వృద్ధులను చలి నుంచి కాపాడేందుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్" హేమరాజ్ సింగ్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
🏠 Home