🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 9:38 pm Posted by : TELANGANA KERATAM

సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి

News Image
ముఖ్యమైన పాయింట్స్:సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి
సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతితెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్  *ఇందిరమ్మ ఇళ్ల నుంచి రైతుల సమస్యల వరకు.. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ* 
రెండు, మూడు రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతీక్ జైన్ హామీ
సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, అభివృద్ధి పనులపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు.
 *ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జాప్యంపై అభ్యంతరం* 
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 823 ఇళ్లను ప్రతిపాదించగా, కేవలం 207 ఇళ్లకు మాత్రమే మంజూరు లభించిందని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 616 ఇళ్లను కూడా వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్‌-1 జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు సైతం ఇళ్ల మంజూరులో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఏఐ ఫోటో క్యాప్చరింగ్ పేరుతో ప్రక్రియను జాప్యం చేస్తుండటంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేకపోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 *ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి* 
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం కొనసాగించాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని ఎమ్మెల్యే కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయినప్పటికీ, రైస్ మిల్లర్లు లారీ లోడ్లను సకాలంలో తీసుకోవడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి తూకం వేసిన తర్వాత గోదాములకు లేదా రైస్ మిల్లులకు తరలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైస్ మిల్లులకు ప్రభుత్వం నుంచి టార్గెట్లు కేటాయించలేదనే కారణంతో ధాన్యాన్ని తీసుకోవడం లేదని తెలిపారు. దీంతో కొనుగోలు కేంద్రాలు, గోదాముల్లో ధాన్యం నిల్వ చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు.
అకాల వర్షాలు కురిసినప్పుడు ధాన్యం తడవకుండా గన్నీ బ్యాగులు, అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు సరిపడా గోదాం సదుపాయాలు కల్పించాలని కోరారు.
పంటలు వేసిన తర్వాత విద్యుత్ అంతరాయం ఏర్పడినపుడు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని MLA చింత ప్రభాకర్ గుర్తు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పుల కారణంగా ఈసారి వరి దిగుబడి కూడా తగ్గిందని, రైతులు పండించిన కొద్దిపాటి ధాన్యాన్ని త్వరగా విక్రయించి తమ వ్యవసాయ పనులు కొనసాగించుకోవాలనుకుంటున్న తరుణంలో కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమని తెలిపారు.
 *మామిడిపల్లి ఈద్గా స్థల సమస్య పరిష్కరించాలి* 
మామిడిపల్లి గ్రామంలోని ఈద్గా స్థల సమస్యను కూడా ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కుంట పక్కన ఉన్న స్థలానికి సంబంధించి ఇప్పటికే ఫైల్ ప్రక్రియ పూర్తయిందని, తహసీల్దార్ భౌతికంగా పరిశీలించి సర్వే కూడా నిర్వహించారని తెలిపారు. అయితే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మట్టిని రోడ్డు నిర్మాణ పనుల పనుల్లో మట్టిని తరలించడం వల్ల అక్కడ పెద్ద గుంత ఏర్పడిందని, దీంతో ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరగా, దానికి బదులుగా మరోచోట అనువైన స్థలాన్ని గుర్తించి కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
 *మునిదేవుని పల్లి భూసేకరణలో రైతులకు న్యాయం చేయాలి* 
మునిదేవునిపల్లి గ్రామంలో టీజీఐఐసీ ద్వారా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, భూములు కోల్పోతున్న రైతులకు పూర్తి పరిహారం చెల్లించకముందే ప్రైవేటు వ్యక్తులతో సర్వేలు చేయిస్తూ పనులు ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులందరికీ పూర్తి పరిహారం అందించిన తర్వాతే తదుపరి పనులు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.
అదేవిధంగా భవిష్యత్తులో గ్రామానికి అవసరమయ్యే కనీస మౌలిక సదుపాయాల కోసం 20 ఎకరాల భూమిని కేటాయించి ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
 *ఆరూర్ లో గ్రామ అవసరాలకు భూమి కేటాయించాలి* 
ఆరూర్ గ్రామంలో టీజీఐఐసీ ద్వారా చేపడుతున్న భూసేకరణలో భాగంగా ఆలయాలు, కుంటలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలోని కుంటలు భవిష్యత్తులో భూగర్భ జలాల స్థిరత్వానికి ఎంతో ఉపయోగపడతాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అన్ని భూములను భూసేకరణలో కలిపేసి గ్రామానికి అవసరమైన స్థలాలు లేకుండా చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో గ్రామానికి స్మశానవాటిక ఏర్పాటు చేసుకోవడానికి కూడా స్థలం లేకుండా పోయే ప్రమాదం ఉందని. కాబట్టి ఆలయాలు, కుంటలు, స్మశానవాటికతో పాటు గ్రామానికి అవసరమైన కనీస సదుపాయాల కోసం భూమిని మినహాయించాలని కోరారు.
 *సంగారెడ్డి బైపాస్ రోడ్డు నిర్మాణంలో మ్యాప్ ప్రకారం వెడల్పు ఉండాలి* 
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ మ్యాప్ ప్రకారం ఎక్కడైతే 60 అడుగుల వెడల్పు సూచించబడిందో అక్కడ 60 అడుగులు, ఎక్కడైతే 80 అడుగుల వెడల్పు సూచించబడిందో అక్కడ 80 అడుగుల మేర రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు.
అదేవిధంగా అంచనాల్లో పొందుపరిచిన విధంగా డివైడర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తూ రోడ్డు అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు.
 *పోతిరెడ్డిపల్లి స్మశానవాటికకు ఇబ్బందులు లేకుండా చూడాలి* 
సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు నిర్మిస్తున్న ఆరు వరుసల రహదారి పనుల్లో భాగంగా సంగారెడ్డి చౌరస్తా సమీపంలోని పోతిరెడ్డిపల్లి స్మశానవాటికలో సగానికి పైగా స్థలం రోడ్డు నిర్మాణంలో కలిసిపోతుందని ఎమ్మెల్యే తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
స్మశానవాటిక వెనుక భాగంలో ఉన్న నాలాపై బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయడంతో పాటు అదనపు భూమిని సమకూర్చి స్మశానవాటికకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. అవసరమైన నిర్మాణాలను ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల ద్వారానే చేపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అదేవిధంగా సంగారెడ్డి చౌరస్తా వద్ద ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి బస్టాండ్ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు.
 చెర్యాల గ్రామంలో కుల భవనాలకు కేటాయించిన స్థలాన్ని కాపాడాలి
చెర్యాల గ్రామ పరిధిలో జిల్లా స్థాయిలో వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఆ స్థలానికి పక్కనే ఉన్న భూమిని టీజీఐఐసీ పేరుతో తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కుల భవనాల నిర్మాణానికి ఇప్పటికే కేటాయించిన స్థలాన్ని మినహాయించి, ఆ సంఘాలు తమ భవనాలను అభివృద్ధి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
 ఇరిగేషన్ కల్వర్టులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి 
రైతులకు ఉపయోగపడే విధంగా కొండాపూర్ గ్రామ పరిధిలో ఇరిగేషన్ కాల్వపై కల్వర్టు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా నాగాపూర్ గ్రామానికి సంబంధించిన ఇరిగేషన్ కల్వర్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు అందజేశారు.రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను కోరారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్లు మంజూరు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.రెండు, మూడు రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రస్తావించిన అన్ని అంశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందిస్తూ, రెండు మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్ల మంజూరుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వెంటనే చేస్తామని తెలిపారు.ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.
🏠 Home