ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిష్కరించాలి
ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం)నవంబర్ 16: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును అధికారులు బాధ్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకొని,వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలు 7, ఇందిరమ్మ ఇండ్లు 2, పింఛన్లు 4,ఇతరశాఖలకు సంబంధించినవి 9 కలిపి మొత్తం 22 దరఖాస్తులు అందాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువు లో పరిష్కరించాలని సూచించారు.పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలపై జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు అర్జీదారులకు తెలుపాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జీ,ఎం.సంపత్ రావు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.