ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంలో పత్రికా రంగం ముందుండాలి
విలువలతో వాస్తవాలతో కూడిన విశ్లేషణే జర్నలిజం లక్ష్యం
టియుడబ్ల్యుజే(ఐజేయు)జిల్లా కమిటీ సభ్యుడు ఎనగందుల శంకర్.
ములుగు జిల్లా బ్యూరో,
(తెలంగాణ కెరటం) నవంబర్ 16:
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంలో పత్రికా రంగం ముందుండాలని,ప్రశ్నించే గొంతుకగా.. ప్రజా స్వామ్యానికి నాలుగవ స్తంభంగా జర్నలిజం ఉందని,విలువలతో, వాస్తవాలతో కూడిన విశ్లేషణే జర్నలిజం లక్ష్యమని టియుడబ్ల్యుజే (ఐజేయు) ములుగు జిల్లా కమిటీ సభ్యుడు ఎనగందుల శంకర్ అన్నారు.జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యుజే(ఐజేయు)జిల్లా కమిటీ సభ్యుడు ఎనగందుల శంకర్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా
స్వామ్యంలో పత్రికా రంగం కేవలం సమాచారాన్ని అందించే మాధ్యమమే కాకుండా,పాలకులను ప్రశ్నించే శక్తిగా,ప్రజల హక్కులను కాపాడే బాధ్యతాయుతమైన వేదికగా నిలవాలని అన్నారు.ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వాస్తవాల ఆధారంగా,విలువలతో కూడిన రీతిలో అందించడమే నిజమైన జర్నలిజమని పేర్కొన్నారు.అధికారం ఎక్కడ దుర్వినియోగం అయినా ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై అధికారులను నిలదీయడం,పాలకుల విధానాలను విశ్లేషించడం పత్రికల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రశ్నించడం అంటే వ్యక్తులను కించపరచడం కాదని,ప్రజా ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా జవాబుదారీతనాన్ని కోరడమని అన్నారు. ప్రచురించే వార్తల్లో వ్యక్తి గత అభిప్రాయాలకు, పక్షపాతాలకు తావు లేకుండా వాస్తవాలు, ఆధారాలు,విశ్వసనీయతకు పెద్దపీట వేయాలని సూచించారు.సంచలనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కలాన్ని వినియోగించాలని పిలుపునిచ్చారు. సామాన్యుల సమస్యలకు అక్షరరూపం ఇస్తూ, నిరుపేదలు,బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలుస్తూ, అన్యాయం,అవినీతి, అక్రమాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకు రావాలని అన్నారు. ఒత్తిళ్లు,ప్రలోభాలకు లొంగకుండా పత్రికా స్వేచ్ఛను,జర్నలిజం విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పాత్రికేయుడిపై ఉందని పేర్కొన్నారు.నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం, తప్పును ప్రశ్నించే నిబద్ధత,ప్రజలకు విలువలతో కూడిన సమాచారాన్ని అందించే బాధ్యత కలిగినప్పుడే పత్రికారంగానికి నిజమైన గౌరవం లభిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా పాత్రికేయులందరికీ జాతీయ పత్రికాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.