హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గల హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను కమిషనర్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే చట్టపరిధిలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, దాని పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.
స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, సంబంధిత సమాచారాన్ని అప్‌లోడ్ చేసే విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దస్త్రాలు, నేర రికార్డులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలపై ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచుగా సందర్శించి ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు, స్థానిక సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు రాత్రి వేళల్లో గస్తీని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ,వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలను అందించాలని సిబ్బందికి సూచించారు.