నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
పేదల కళ్లలో ఆనందమే ప్రజాప్రభుత్వ సంక్షేమం
రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి నూతన చేయూత పింఛన్లు
పింఛన్ల మంజూరులో మహిళలకు పెద్దపీట..3.5 లక్షల మంది మహిళలకు ఆర్థిక భరోసా
అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని భరోసా
రాష్ట్రంలో తొలిసారిగా తలసేమియా బాధితులకు చేయూత పింఛన్లు
రూ.230కే సిమెంట్ బస్తా అందించేలా సీఎం చర్యలు
మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధికి ప్రోత్సాహం
పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క.
ములుగు జిల్లా బ్యూరో (తెలంగాణ కెరటం) నవంబర్ 16:
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.ములుగు మండలం ఇంచర్లలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ములుగు, వెంకటాపూర్ మండలాలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.ఇందులో సుమారు 3.5 లక్షల మంది మహిళలే ఉన్నారని,పింఛన్ల మంజూరులో మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిందని అన్నారు.మరో 13 వేల మంది నుండి దరఖాస్తులు అందాయని తెలిపారు. అర్హత ఉండి ఇప్పటికీ పింఛన్లు అందని వారి దరఖాస్తులను పరిశీలించి తప్పకుండా పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.ములుగు జిల్లాలో అర్హులైన వారికి పింఛన్లు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రజల నుండి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. వితంతువులు,ఒంటరి మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా పింఛన్ల ద్వారా భరోసా కల్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలు,స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో అర్హులను గుర్తించిపింఛన్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు.మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులను మహిళల పేరిట మంజూరు చేస్తూ వారికి ఆర్థిక,సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో పాటు మహిళాసంఘాలకు బస్సులను కేటాయిస్తూ ఆదాయ వనరులను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.వృద్ధ మహిళలకు సైతం మహిళా సంఘాల్లో సభ్యత్వం కల్పించి,రుణ సదుపాయాలు, జీవనోపాధి అవకాశాలు అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కుటుంబ సభ్యుల ఆదరణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధ మహిళలకు సంఘాల ద్వారా అండగా నిలుస్తున్నామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.లక్ష నుండి రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తూ వస్త్ర దుకాణాలు,కిరాణా షాపు నిర్వహణ,కోళ్ల పెంపకం, మేకల పెంపకం వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సిమెంట్ కంపెనీలతో చర్చించి రూ.230కే ఒక సిమెంట్ బస్తా అందించేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు.అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంతో పాటు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని అన్నారు.కుటుంబ సంపాదన సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ పథకం ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించి ఆయా కుటుంబాలకు అండగా నిలవనున్నట్లు పేర్కొన్నారు.మహిళలు కష్టాలను అధిగమించి ఆర్థికంగా ఎదగాలని, కుటుంబాలను బలోపేతం చేయాలని మంత్రి సీతక్క సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇంచర్ల గ్రామానికి చెందిన మల్లక్కను ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా చదవడం, రాయడం నేర్పిస్తున్నామని,రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది మహిళలు రాత పరీక్షల్లో పాల్గొన్నట్లు తెలిపారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవడానికి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడం ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా రక్త మార్పిడి అవసరమయ్యే తలసేమియా బాధితులకు చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు,పింఛన్లు,రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ,రైతు రుణమాఫీ, ఉచితవిద్యుత్,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామాల్లో సీసీ రోడ్లు,ఇతర రహదారులు, గిరిజన గూడేల్లో మౌళిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చి పనులు చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, కుటుంబాల అభివృద్ధితో గ్రామాలు ప్రగతి సాధిస్తాయని మంత్రి సీతక్క అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో మొత్తం 4,262 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. మండలాల వారీగా ఏటూరునాగారంలో 485 మందికి,గోవిందరావుపేటలో 497 మందికి,కన్నాయి గూడెంలో 81 మందికి, మల్లంపల్లిలో 219మందికి, మంగపేటలో 667మందికి ములుగులో 390మందికి, తాడ్వాయిలో 340 మందికి,వెంకటాపూర్లో 396 మందికి,వాజేడులో 470 మందికి,నూగూరు వెంకటాపురంలో 515 మందికి, ములుగు మున్సిపాలిటీ పరిధిలో 202 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరైనట్లు వివరించారు.పింఛన్ల కోసం అందిన దరఖాస్తులనుఎంపీడీఓలు పరిశీలించిన అనంతరం డీఆర్డీఓ ఆమోదంతో అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.ములుగు, వెంకటాపూర్ మండలాలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 988 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను అందజేస్తున్నామని తెలిపారు.అనంతరం మంత్రి సీతక్క మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు,వృద్ధులు, దివ్యాంగులు,నేతన్నలు, గీతన్నలతో పాటు తలసేమియా బాధితులకు సైతం పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని మండలాల్లో పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. సిద్ధిపేట నుండి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు,భీమా సదుపాయాలతో పాటు అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా అక్షరాస్యతను పెంపొందిస్తున్నామని తెలిపారు.ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ములుగు,వెంకటాపూర్ మండలాల్లో గ్రామాల వారీగా,ములుగు మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం.సంపత్ రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి,పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసియా,డిఆర్డీఓ చంద్రశేఖర్,మున్సిపల్ కమిషనర్ సంపత్, షాహిన్,స్థానిక సర్పంచ్ ముశినపెల్లి కుమార్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.