మెట్పల్లి పట్టణ సమస్యలు పరిష్కరించాలని బిజెపి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
అధికార యంత్రాంగం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం
మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : మెట్పల్లి పట్టణంలో నెలకొన్న స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ మెట్ పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ అధ్యక్షులు దోనికెల నవీన్ నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, బిజెపి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్ డాక్టర్ గంగసాగర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొని, నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దోనికెల నవీన్మాట్లాడుతూ.. మెట్పల్లి పట్టణ ప్రజలుఎదుర్కొంటున్న అనేక సమస్యలను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, అధికారులు స్పందించకపోవడం విచారకరమని అన్నారు.పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని, సమీకృత కూరగాయల మార్కెట్ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమృత్-02 పథకం కింద చెరువు సుందరీకరణ కోసం రూ.03 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ, క్షేత్రస్థాయిలో కేవలం రూ.10 నుంచి రూ.15 లక్షల విలువైన పనులు మాత్రమే జరిగినట్లు కనిపిస్తోందని, అయితే రూ.65 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. చెరువు సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని అధికారులు, కాంట్రాక్టర్లపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత బస్టాండ్, ఆర్టీసీ డిపో, ఆరపేట చౌరస్తా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్లు, ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. పట్టణంలోని ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. రైతులు పండించిన పంటలకు నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ నిరాహార దీక్షకు అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రజల పక్షాన నిరంతర పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి వందల సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు హాజరై సంఘీభావం తెలిపారు. కార్యకర్తల్లో ఈ కార్యక్రమం నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జుంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీష్, కలికోట శ్రీకాంత్, మెట్పల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, బొడ్ల వసుధ నాగేష్, కోయల్ కార్ స్రవంతి లింగేశ్వర్, పూడికారపు దివ్య కిషోర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు లోలపూ అనిల్, కొయ్యల లక్ష్మణ్, గుంటుక హనుమాన్లు, భోగ దత్తు, ఐటీ సెల్ కన్వీనర్ పాస్ కంటి శ్రీనివాస్, తిరుసుల్లా అర్జున్, కిషన్ మోర్చా అధ్యక్షులు బొడ్ల అనిల్, ఓబిసి మోర్చా అధ్యక్షులు సంకు ప్రసాద్, సుంకే అశోక్, కళాలి రాజిరెడ్డి, శంభోజి శ్రీధర్ ఆచారి, గుండు మోహన్, గుండు ప్రభాకర్, దండిగా నరసయ్య, రఘుపతి, మొగిలి పాక హరికృష్ణ, బిజెపి పట్టణ మహిళా నాయకురాలు గొంగళ్ల రజిని, వంగ లాస్య, మల్లాపూర్ మండల ఉపాధ్యక్షులు రాజా గౌడ్, నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.