మెట్పల్లి ఉర్దూ పాఠశాల, షాదీఖానా అభివృద్ధిపై దృష్టి సారించాలి
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఖుతుబోదీన్ పాషా
ప్రజావాణిలో వినతి పత్రం అందజేత
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : మెట్పల్లి పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మాణం, మైనారిటీ షాదీఖానా అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖుతుబోదీన్ పాషా సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కేవై.ప్రసాద్ ను కలిసి, వినతి పత్రం అందజేశారు. అనంతరం పాషా మీడియాతో మాట్లాడుతూ.. మెట్పల్లి పట్టణంలోని ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూల్ భవనం సంవత్సరాలు గడుస్తున్నా, అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మన ఊరు - మన బడి పథకం కింద పాఠశాల భవనానికి నిధులు మంజూరైనప్పటికీ, పనులు పూర్తి కాకపోవడంతో, సరైన భవన వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూల్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి, పిల్లల భవిష్యత్తును కాపాడాలని కలెక్టర్ ను కోరినట్లు చెప్పారు. అదేవిధంగా, మెట్పల్లి పట్టణంలోని బీడీ కాలనీలో నిరుపేద మైనారిటీల వివాహాలు, శుభకార్యాల కోసం 2005 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీ షాదీ ఖానా మంజూరైందని గుర్తు చేశారు. అయితే 21 సంవత్సరాలు (రెండు దశాబ్దాలు) గడుస్తున్నా నేటికీ షాదీ ఖానా అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, షాదీ ఖానా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా రెవిన్యూ అధికారి కేవై ప్రసాద్ ఈ రెండు పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చినట్లు మహమ్మద్ ఖుతుబోదీన్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సాజిద్, మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.