దుబ్బాక, సిద్దిపేట అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించాలి-మల్లన్న సాగర్ భూ బాధితులను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి-చేనేత, పద్మశాలి కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకం ఏర్పాటు చేయాలి-సీఎం రేవంత్ రెడ్డికి బీఎల్ఎఫ్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు లేఖ
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, అఖండ దీపం:
తెలంగాణ రాష్ట్రంలోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, రాజకీయ నాయకులు స్వార్థపూరిత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని బహుజన లిబరల్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎస్పీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మాచవరం వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు.. దుబ్బాక చేనేత కళలు అద్భుతమైన నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, ఈ ప్రాంతంలోని చేనేత, పద్మశాలి కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి రూ.50 కోట్లు కేటాయించాలని కోరారు.అలాగే దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూ.80 కోట్లు కేటాయించాలని, నూతనంగా ఏర్పాటైన భూంపల్లి-అక్బర్పేట, రాయపోల్, నార్సింగి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.65 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మిరుదొడ్డి, చేగుంట మండలాలకు చెరో రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.20 కోట్లు మంజూరు చేయాలని కోరారు.నియోజకవర్గంలోని ఏడు మండలాల అభివృద్ధికి సంబంధించి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అవసరమైన నిధులు కేటాయించాలని సూచించారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గ్రామాలను కోల్పోయి, జీవనోపాధి దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న భూ నిర్వాసితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తించాలని కోరారు. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు.రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని శ్రీరాం రామకృష్ణ ప్రభు ముఖ్యమంత్రిని కోరారు.ఈ కార్యక్రమంలో సాన తిరుపతి, గుండా శ్రీనివాస్, మల్లేశం, వెంకటేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.