ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జర్నలిజమే
- జాతీయ జర్నలిజం దినోత్సవ వేడుకలో డబ్ల్యూజేఐ నేతలు
- జర్నలిజంలో 30 యేళ్ళ పాటు పని చేసిన యూనియన్ నేతలకు సన్మానం
- వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి సభ్యులకు తేనేటి విందు
ఖమ్మం, నవంబర్ 17 (తెలంగాణ కెరటం): దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జర్నలిజమేనని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) నేతలు అన్నారు. జర్నలిస్టులు నిజాన్ని అన్వేషించి, దానిని వెలుగులోకి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తున్నారని కొనియాడారు. జాతీయ జర్నలిజం దినోత్సవాన్ని పురష్కరించుకొని మంగళవారం ఖమ్మంలోని ఎన్నెస్పీ రామాలయం ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ ఆధ్వర్యంలో సభ్యులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిజంలో 30 యేళ్ళ పాటు పని చేసిన సీనియర్ జర్నలిస్టులు ఎన్.ఎస్.రావు, కట్టెకోల చిన నరసయ్య, యెన్నెబోయిన శ్రీనివాస రావు, జాబిశెట్టి కుటుంబ రావు, ఎం.ఏ అన్సార్ పాషా, యం డి.షఫీ యు జమ, గోగుల నారాయణ రావు, గంటెల ఆనంద్, ఏనిగండ్ల శ్రీనివాస రావులను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం యూనియన్ తెలంగాణ కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్.రావు) మాట్లాడుతూ జర్నలిస్టులు నిజాయితీ, సమగ్రత, తటస్థత, చట్టబద్ధత మరియు ప్రజలకు జవాబుదారీతనం వంటి సూత్రాలను పాటించి పని చేయాలని ఉద్భోధించారు. అప్పుడే అభ్యుదయ సామాజిక మార్పుకు దోహద పడిన వారమవుతామని చెప్పారు. అయితే, వృత్తిలో జర్నలిస్టులకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు కనీస వేతనాలు దక్కేల చర్యలు చేపట్టాలని కోరారు. అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నారని, తెలంగాణలో కూడా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, దశాబ్ధాల తరబడి అపరిష్కృతంగా వున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కోకన్వీనర్ యెన్నెబోయిన శ్రీనివాస రావు మాట్లాడుతూ నేడు జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ ఈ వృత్తిలో కొనసాగుతున్నారని అన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వాలు కూడా నిర్ధిష్టమైన పథకాలేవీ అమలు చేయడం లేదన్నారు. మరో వైపు జర్నలిజం కత్తి మీద సాములా మారిందని, జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని చెప్పారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుందని, జర్నలిస్టులకు అన్నీ విధాలా రక్షణ కల్పించాలని కోరారు. అదే సందర్భంలో జర్నలిస్టులందరూ ఐక్యంగా దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఐక్యంగా వుంటేనే, సంక్షేమ పథకాలను సాధించడంతో పాటు దాడులను ఎదుర్కోగలమని అన్నారు. మరో జిల్లా కోకన్వీనర్ ఎం.ఏ అన్సార్ పాషా మాట్లాడుతూ ఎప్పుడూ బిజీగా వుండే జర్నలిస్టులకు అప్పుడప్పుడూ యూనియన్ ఆధ్వర్యంలో ఆట విడుపుగా ఆటా పాట వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు నాయకులు బొడ్డుపల్లి రవీందర్, పసుపులేటి ఉపేందర్, శ్రీనివాస చారి, వుల్లోజీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.