🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 11:38 am Posted by : TELANGANA KERATAM

ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు రూ. 50 వేలు డిమాండ్!

News Image
రూ. 5 వేలు ఫోన్‌పే చేసినా ఇల్లు రాలేదని బాధితుడి ఆవేదన
ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు.. సమగ్ర విచారణకు డిమాండ్
కారేపల్లి, మన తెలంగాణ కెరటం:
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇళ్ల' పథకంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని రూ. 50 వేలు డిమాండ్ చేయగా, రూ. 5 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించినప్పటికీ తనకు ఇల్లు మంజూరు కాలేదని చిన్నమడంపల్లి పంచాయతీ పరిధిలోని మోకాళ్ల రామయ్య గుంపునకు చెందిన మోకాళ్ల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతి వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.  
బుధవారం కారేపల్లిలోని తుడుందెబ్బ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు రమేష్ తన గోడును వెళ్లబోసుకున్నారు. తమ కుటుంబం కనీస వసతులు లేని రేకుల షెడ్డులో అత్యంత దీనస్థితిలో నివసిస్తోందని, తొలి జాబితాలో అధికారుల ఇంటి వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని వాపోయారు. దీనిపై సర్పంచ్ భర్తను సంప్రదించగా.. "పైస్థాయి అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, రూ. 50 వేలు ఇస్తేనే ఇల్లు మంజూరవుతుంది" అని డిమాండ్ చేసినట్లు రమేష్ ఆరోపించారు. గత్యంతరం లేక ఆయన వ్యక్తిగత ఫోన్‌పే ఖాతాకు రూ. 5 వేలు పంపినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీల స్క్రీన్‌షాట్లు, ఫోన్ సంభాషణల వాయిస్ రికార్డింగ్‌లు తన వద్ద పూర్తి ఆధారాలుగా ఉన్నాయని స్పష్టం చేశారు.  
సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి:
తన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని రమేష్ కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి అర్హత ప్రాతిపదికన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కూడా జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు.  
ఈ విలేకరుల సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర కోశాధికారి కల్తీ రాంప్రసాద్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం శివరాం, సంక్షేమ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వట్టం నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొని బాధితుడికి మద్దతు తెలిపారు.
🏠 Home