తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అయేషా మరియం అద్భుత ప్రతిభ కనబరిచి, రజత పతకం సాధించింది. అండర్-14 బాలికల విభాగంలో అండర్-26 కేజీల వెయిట్ కేటగిరీలో పాల్గొన్న అయేషా మరియం ఫైనల్ పోరులో ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గుజ్జెటి వెంకటేష్ మాట్లాడుతూ, విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో రజత పతకం సాధించడం పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పతకం సాధించిన అయేషా మరియం, ఆమె తండ్రి అతీక్‌ను పాఠశాల ప్రిన్సిపాల్, తైక్వాండో కోచ్ నవనంది రమేష్, అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.