2,వ వార్డులో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలి
మున్సిపల్ కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి పత్రం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : జగిత్యాల పట్టణంలోని 02,వ వార్డులో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిజెపి నాయకులు గురువారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..02,వ వార్డులో గత కొంతకాలంగా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు క్రమం తప్పకుండా రావడం లేదని, దీంతో వార్డు ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ వేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం వల్ల వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు. 02,వ వార్డులో ప్రతిరోజూ చెత్త సేకరణ వాహనాలు క్రమం తప్పకుండా వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వార్డులో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, స్థానిక బూత్ అధ్యక్షులు నారాయణ, పవన్ సింగ్, రెండో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.