గ్యాంగుల పేరుతో హల్‌చల్ చేస్తే కఠిన చర్యలు
గ్యాంగుల పేరుతో హల్‌చల్ చేస్తే కఠిన చర్యలు
- ఇన్స్పెక్టర్ ఎండీ.సాధిక్ పాషా
‘చంటి భాయ్ గ్యాంగ్’ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్న వారిపై కేసుల నమోదు చేసినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సాబీర్ పాషా తెలిపారు. ‘చంటి భాయ్ గ్యాంగ్’ అంటూ గ్రూపులుగా ఏర్పడి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు, వీడియోలు పెడుతున్న నగరంలోని శుక్రవారపుపేట చెందిన మహ్మద్ వజీద్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గ్యాంగుల పేరుతో హడావుడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో గ్యాంగుల పేరుతో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.