వరంగల్‌లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు!
మహిళ ఇంటిపై బుల్డోజర్.. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత!
అధికారులతో కుమ్మక్కై తన ఇంటిని కూల్చివేయించారని బాధితురాలి ఆరోపణ..న్యాయం చేయాలని వేడుకోలు!
వరంగల్ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 20
వరంగల్ నగరంలో భూముల విలువ పెరుగుతుండటంతో భూకబ్జాదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన భూములపై కన్నేస్తున్న కొందరు వ్యక్తులు సామాన్యుల ఆస్తులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా న్యూ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకున్న ఓ మహిళ ఇంటిని కూల్చివేత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో నిర్మించుకున్న తన ఇంటిని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది శుక్రవారం ఉదయం కూల్చివేశారని బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన వాదన వినకుండా ఇంటిని నేలమట్టం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది.గతంలో తమ కుటుంబానికి ఎకరం భూమి ఉండేదని, తన తండ్రి కొంత భూమిని విక్రయించగా మిగిలిన స్థలంలో సుమారు 133 గజాల మేర ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఎన్నో ఏళ్లుగా తనకు ఆధారంగా ఉన్న ఇంటిని ఒక్కసారిగా కూల్చివేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.
అధికారులతో కుమ్మక్కై ఇంటిని కూల్చివేశారా?
తన పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు విలువైన స్థలాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో అధికారులతో కుమ్మక్కై తన ఇంటిని కూల్చివేయించారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు సంబంధించిన భూమి పత్రాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించకుండా కూల్చివేతకు ఎలా పాల్పడ్డారని నిలదీస్తోంది. స్థానికులు సైతం ఆ స్థలం తనదేనని చెబుతున్నప్పటికీ, కొందరు అధికారులు ఇతరులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది.
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేత ఎలా?
ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తన ఇంటిని కూల్చివేయడానికి ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని బాధితురాలు వాపోతోంది. తనకు వివరణ ఇచ్చే అవకాశం కూడా కల్పించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు ఎవరి ఆదేశాలతో కూల్చివేత చేపట్టారు? ఏ ఆధారాలతో తన ఇంటిని నేలమట్టం చేశారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలి!
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని బాధితురాలు కోరుతోంది. తన స్థలానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేస్తోంది. కూల్చివేతకు బాధ్యులైన అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.భూముల విలువ పెరిగిందని సామాన్య మహిళల ఆస్తులకు రక్షణ లేకుండా పోవాలా? తనకు న్యాయం చేయాల్సిన అధికారులే తన ఇంటిని కూల్చివేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. బాధితురాలికి న్యాయం జరుగుతుందా? లేక ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంటుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.