జిల్లా సంగీత వాయిద్యాల పోటీలో పోతారం విద్యార్థికి ద్వితీయ స్థానం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 20 : జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జగిత్యాల డీసీఈబి వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి పీఎంశ్రీ పాఠశాలల కళా సాంస్కృతిక పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలలో కథలాపూర్ మండలానికి చెందిన పీఎంశ్రీ ఎంపిపిఎస్ పోతారం పాఠశాల విద్యార్థి అన్నారపు రిత్విక్ అద్భుత ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయిలో సంగీత వాయిద్య పరికరాల సాధనలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలలో పోతారం పాఠశాల తరఫున ప్రతిభ చాటిన విద్యార్థి అన్నారపు రిత్విక్ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటాడు. ఈ విద్యార్థులను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గైడ్ టీచర్ ఎం.సారిక ఎస్జీటీ విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ, పాఠశాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ను జిల్లా అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖాధికారి కె.రాము విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ..పిఎమ్శ్రీ పాఠశాలలు విద్యార్థులలో సంపూర్ణ నైపుణ్యాల వికాసానికి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ఇలాంటి కళా, సాంస్కృతిక పోటీలు ద్వారా పిల్లలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని ఆశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.