రాజ్యాంగ హక్కులను అందిపుచ్చుకుంటేనే మహిళా సాధికారత సాధ్యం!
మహిళల హక్కులు, సమాన అవకాశాలపై చర్చకు సిద్ధం.. 26న ‘మహిళలు – రాజ్యాంగం’ సదస్సు
సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
ఎల్బీనగర్ హైదరాబాద్, నవంబర్ 21:మహిళా సాధికారత సాధించాలంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను మహిళలు సంపూర్ణంగా అందిపుచ్చుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతాయని పేర్కొన్నారు.భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న నిర్వహించనున్న ‘మహిళలు – రాజ్యాంగం’ సదస్సు పోస్టర్‌ను శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు అనేక హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని, వాటిపై అవగాహన పెంపొందించుకుని ఆచరణలో వినియోగించుకున్నప్పుడే మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అగ్రగామిగా ఎదగగలరని అన్నారు.రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళలకు అందుతున్న రాజ్యాంగ ఫలాలు, హక్కుల అమలు తీరు, మహిళల ప్రస్తుత జీవన పరిస్థితులపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, శ్రామికులు, గృహిణుల జీవన స్థితిగతులు, మహిళల హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సాధికారత తదితర కీలక అంశాలపై సదస్సులో చర్చించి, మహిళల అభ్యున్నతికి అవసరమైన పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సు మహిళల్లో రాజ్యాంగ హక్కులపై అవగాహన పెంపొందించడంతో పాటు, మహిళా సాధికారతకు బలమైన దిశానిర్దేశం చేసే వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. మహిళలకు హక్కులు, గౌరవం, సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.