రేవంత్ రెడ్డి ప్రసంగంలో సౌండ్ ఎక్కువ.. సొల్యూషన్ తక్కువ
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 21, నవంబర్
తిట్ల దండకంతో కాంగ్రెస్ పతనానికి పునాదులు.. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం
సీఎం సభపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు కాంగ్రెస్ పార్టీ పతనానికి సంకేతంగా మారుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో సౌండ్ ఎక్కువ.. సొల్యూషన్ తక్కువగా ఉందని, ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. తుపాకీ రాముడి కంటే ఎక్కువగా, పిట్టల దొర కంటే తక్కువ కాకుండా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు.సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభపై సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వస్తున్నారంటే ప్రజలు ఏదో ఒక వరం ప్రకటిస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురుచూస్తారని అన్నారు. కానీ సిద్దిపేట సభలో 26 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించి, ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్లీనరీ నిర్వహించినట్లుగా వ్యవహరించారని విమర్శించారు. సభ ఆద్యంతం ప్రజా సమస్యలు, అభివృద్ధి, నిధుల కేటాయింపుల ప్రస్తావన లేకుండా తిట్ల దండకంతోనే కొనసాగించి చివరకు తోకముడిచారని ఎద్దేవా చేశారు.
తన చేతగానితనాన్ని, పాలనలోని వైఫల్యాలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల ముందు ఎండగడుతున్నారనే కసి, రాజకీయ ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని విమర్శించారు.
ఒకప్పుడు సోనియా గాంధీని బడిబిడ్డ, ఇటలీ బొమ్మ అంటూ విమర్శించిన నోటితోనే నేడు ఢిల్లీ పెద్దల ముందు అటెండర్ల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి పాలనను ప్రజలే కాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాలనలో 20 శాతం కమిషన్లు నడుస్తున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించగా, పాలన బాగోలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నిస్తుంటే, వారికి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వారినే పిచ్చికుక్కలని తిట్టే స్థాయికి దిగజారారని విమర్శించారు.రాజకీయంగా ఎన్ని దండయాత్రలు చేసినా, ఎన్ని రాజకీయ విన్యాసాలు ప్రదర్శించినా ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదని హితవు పలికారు.
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఘాటు వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష, చేస్తున్న వ్యాఖ్యల్లో పొంతన కనిపించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్యులను సంప్రదించుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కేవలం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లను దూషించడానికే సిద్దిపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లుందని అన్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదని విమర్శించారు.గతంలో కేసీఆర్ బహిరంగ సభలకు వస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేసేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి సభలు మాత్రం ప్రతిపక్ష నేతలను తిట్టడంతో ప్రారంభమై, తిట్లతోనే ముగుస్తున్నాయని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. గవర్నర్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి భాషను మార్చాలని, లేదంటే ఆయనను మార్చే పరిస్థితి రావాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఉద్యమకారుల త్యాగాలను అవమానించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రికి హడావుడి తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, మూడేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచారని విమర్శించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రజలు చీదరించుకుంటున్నారని, విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత మొదలైందని, ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మాజీ సి డి సిచైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి విమర్శలు
మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డికి ముఖ్యమంత్రి వచ్చి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా హడావుడి చేసి వెళ్లిపోయారని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ప్రతి వార్డుకు రూ.8 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి సభలో ఆ హామీల ప్రస్తావన కూడా తీసుకురాలేదని అన్నారు. కనీసం నిధుల కేటాయింపు గురించి కూడా ప్రకటన చేయలేదని మండిపడ్డారు.ముఖ్యమంత్రి ప్రారంభించిన రోడ్డు పనులు సైతం ఇప్పటివరకు పూర్తికాలేదని, అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, మనోహర్ గౌడ్, వేణుగోపాలస్వామి, వాడే మల్లేశం, కసిని శ్రీకాంత్, నాయికోటి నవీన్, శ్రవణ్ రెడ్డి, జీవీ శ్రీనివాస్, నందకిషోర్, అంజాద్, అజీమ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.