అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలి.
అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలి.
అచ్చంపేటలో నమోదు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా నమోదు ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకం నమోదు సందర్భంగా లబ్ధిదారుల నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సక్రమంగా సేకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.శనివారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలోని 4, 5వ వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవ సహాయం తదితర అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా నమోదు కేంద్రంలో పథకానికి సంబంధించి చేపడుతున్న నమోదు ప్రక్రియను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్న దరఖాస్తులు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని పరిశీలించారు. అలాగే సేకరించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానం, నమోదు ప్రక్రియలో అనుసరిస్తున్న మార్గదర్శకాలు, ఇప్పటివరకు పూర్తయిన నమోదు వివరాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారులు సమర్పించే పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని, దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాలకు, ధ్రువీకరణ పత్రాల్లోని సమాచారానికి మధ్య వ్యత్యాసాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆన్లైన్లో వివరాలను నమోదు చేసే సమయంలో పేర్లు, చిరునామాలు, కుటుంబ సంబంధిత సమాచారం తదితర అంశాల్లో ఎలాంటి తప్పులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.నమోదు ప్రక్రియలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.నమోదు కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు కల్పించిన సౌకర్యాలపై కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రజలు నమోదు కోసం వేచి ఉండే సమయంలో వారికి కల్పించిన వసతులు, తాగునీటి సౌకర్యం, కూర్చునేందుకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. నమోదు కేంద్రానికి వచ్చే మహిళలు, వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడకుండా నమోదు ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలని, కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం లక్ష్యాలకు అనుగుణంగా అర్హులైన కుటుంబాల వివరాలను సక్రమంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని, వాటి ప్రకారం నమోదు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.
నమోదు కేంద్రాల్లో నిర్వహించే నమోదు కార్యక్రమం పకడ్బందీగా ఉండాలని, అర్హులైన లబ్ధిదారుల వివరాలు నమోదు కాకుండా మిగిలిపోకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజలకు పథకంపై అవగాహన కల్పిస్తూ, నమోదు చేసుకునేందుకు అవసరమైన వివరాలు, సమర్పించాల్సిన పత్రాల గురించి స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.నమోదు ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన నుంచి ఆన్లైన్ నమోదు వరకు ప్రతి దశను జాగ్రత్తగా నిర్వహిస్తూ, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ మురళి , తాసిల్దార్ సైదులు సంబంధిత శాఖల అధికారులు, నమోదు కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.