మచిలీ బజార్‌లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం!
వరంగల్ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 21
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మచిలీ బజార్ ముదిరాజ్ కమిటీ హాల్‌లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులందరూ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అర్బన్ ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ తెలిపారు.ముదిరాజ్ పెద్దమనుషుల సమక్షంలో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించి, మత్స్యకారులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముదిరాజుల ఐక్యత, హక్కుల సాధన కోసం మరింత కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడం లేదని పులి రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే చేప పిల్లలను వదిలారని, సమయానికి చేప పిల్లలను చెరువులు, కుంటల్లో విడుదల చేయకపోవడం వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ముదిరాజుల చిరకాల డిమాండ్ అయిన బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మచిలీ బజార్, గుడిబండల్ ప్రాంతాల పెద్దమనుషులు భయ్యా శోభన్, పులి సదానందం, కొండా అశోక్, ఇప్ప శివ, రావుల వీరస్వామి, రవీందర్, సందీప్, కృష్ణ, ప్రభాకర్, ప్రకాష్, చందర్, వెంకటస్వామి, కృష్ణకుమార్, స్వామి, బుచ్చిరాజు, సత్యనారాయణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.