🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:19 am Posted by : TELANGANA KERATAM

అలుగునూరు దీక్షా దివస్ సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు

News Image
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కీలక ఘట్టం.. ధర్మపురి నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలి జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం తెలంగాణ కెరటం ప్రతినిధి: మేడిపెల్లి గంగాధర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 29వ తేదీన కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న 'దీక్షా దివస్' భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ మేరకు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రజా సమీకరణ, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష భారత రాజకీయ చరిత్రలోనే ఒక కీలక మలుపుగా నిలిచిందని అన్నారు. "కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో" అనే నినాదంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేసిందని గుర్తుచేశారు. ఆ పోరాట ఫలితంగానే దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో అనేక మంది నాయకులు, విద్యార్థులు, యువకులు, ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. ఆ చారిత్రక ఉద్యమ ఘట్టాలను భావితరాలకు తెలియజేయడంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర సాధన స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయడమే దీక్షా దివస్ సభ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను పార్టీ శ్రేణుల ఐక్యతకు, ఉద్యమ స్ఫూర్తి పునరుద్ఘాటనకు వేదికగా నిలపాలని పిలుపునిచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.ఈ సన్నాహక సమావేశంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home