ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు శంకుస్థాపన.
మద్దిమడుగులో 5 వేల మంది గిరిజనులతో ప్రత్యేక సభ.అచ్చంపేటలో లక్ష మందితో భారీ బహిరంగ సభ.ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 22):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మద్దిమడుగు గ్రామంలో ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదివారం అచ్చంపేట మద్దిమడుగు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడంతో పాటు సుమారు 5 వేల మంది గిరిజనులతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదేవిధంగా అచ్చంపేట పట్టణంలో సుమారు లక్ష మందితో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో ముందుగా అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి, సభా ప్రాంగణం, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మద్దిమడుగు గ్రామానికి చేరుకొని అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేయనున్న రెండు హెలిప్యాడ్ల స్థలాలు, వీఐపీల పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు సంబంధించిన మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, రవాణా, పార్కింగ్ తదితర మౌలిక వసతులు సమకూర్చాలని సూచించారు.
ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్దిమడుగు గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు.గిరిజనుల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సుమారు 5 వేల మంది గిరిజనులు పాల్గొనే బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, రవాణా, పార్కింగ్, భద్రత తదితర సౌకర్యాలుకల్పించాలన్నారు.అదేవిధంగా అచ్చంపేట పట్టణంలో సుమారు లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ప్రజల రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, నిర్ణీత సమయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మద్దిమడుగు, అచ్చంపేట ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మద్దిమడుగులో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్ల శంకుస్థాపన కార్యక్రమం, గిరిజనుల బహిరంగ సభతో పాటు అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అవసరమైన ఏర్పాట్లను శాఖల వారీగా చేపట్టాలని సూచించారు.మద్దిమడుగులో నిర్వహించే సభకు హాజరయ్యే సుమారు 5 వేల మంది గిరిజనులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, బారికేడింగ్, వైద్య సదుపాయాలు, వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేయనున్న రెండు హెలిప్యాడ్ల వద్ద అవసరమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అచ్చంపేట పట్టణంలో లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నందున సభా ప్రాంగణం చుట్టూ 1500 వాహనాలు నిలిపేలా ఐదు వేర్వేరు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సభకు వచ్చే ప్రజలు తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపేలా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలు సభా ప్రాంగణానికి సులభంగా చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సభా ప్రాంగణ పరిసరాల్లో ఉన్న విద్యుత్ వైర్లను అవసరమైన చోట ముందుగానే సురక్షితంగా తరలించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సభా ప్రాంగణంలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ప్రతి శాఖకు కేటాయించిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ
అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మద్దిమడుగు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు శంకుస్థాపన చేయనుండటం గిరిజన సమాజానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని పేర్కొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, బోధనలు, సేవలు గిరిజన సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మద్దిమడుగులో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. అదేవిధంగా అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న లక్ష మందితో కూడిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం, పార్కింగ్, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. గిరిజనుల సంక్షేమం, వారి సంస్కృతి,సంప్రదాయాలకు గౌరవం కల్పించేలా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు.మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుఏర్పాట్ల పరిశీలన అనంతరం ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు ప్రత్యేక పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత, ఆలయ సంప్రదాయాలను వారికి వివరించారు. ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దిమడుగు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం, అచ్చంపేట డీఎస్పీ పి. శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.