బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
ఎన్నికల హామీలు అమలేది ఎప్పుడు..?
మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత ఏదీ..?బెల్లంపల్లి ప్రతినిధి నవంబర్ 22 తెలంగాణ కెరటం బెల్లంపల్లి: మైనార్టీల చిరకాల కోరిక అయిన మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం బెల్లంపల్లిలో ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మైనార్టీల అభివృద్ధికి ఎన్నో హామీలు ఇచ్చే నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా మైనార్టీలు ఫంక్షన్ హాల్ కోసం ఎదురుచూస్తున్నా, వారి సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నారు.బెల్లంపల్లి నియోజకవర్గంలో మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఫంక్షన్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పేద మైనార్టీ కుటుంబాలకు ఇది ఎంతో అవసరమని తెలిపారు.
మైనార్టీల ఓట్లు కావాలి.. కానీ వారి అభివృద్ధి పట్టదా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరిస్తున్నారని ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించి, నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి, వారి అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ కోరారు.