మీరాలం కుంటకు హైడ్రా రక్షణ కంచె
ఫెన్సింగ్ పనులపై రైతుల అభ్యంతరం.. తమ భూములకు నష్టం కలగకుండా న్యాయం చేయాలని వేడుకోలు
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి: చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ అన్నోజిగూడలో ఉన్న మీరాలం కుంటను ఆక్రమణల నుంచి కాపాడేందుకు అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.సుమారు 4 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉన్న మీరాలం కుంట హద్దులను గుర్తించిన అధికారులు, కుంట చుట్టూ రక్షణ కంచె నిర్మాణ పనులు చేపట్టారు. కుంటను ఆక్రమణల నుంచి పరిరక్షించాలని హైడ్రాకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే హైడ్రా చేపట్టిన ఫెన్సింగ్ పనులు స్థానికంగా వివాదానికి దారితీశాయి. కుంటకు రక్షణ కంచె ఏర్పాటు చేయడంపై కొంతమంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోకి వచ్చి ఫెన్సింగ్ పనులు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. తమకు అభ్యంతరాలు ఉంటే హైడ్రా కార్యాలయానికి వచ్చి అధికారులను కలవాలని సూచిస్తున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా సమాధానాలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంట పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని, అయితే కుంట హద్దుల పేరుతో తమ వ్యక్తిగత భూములకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను పరిరక్షించడం ఎంత ముఖ్యమో, రైతుల భూములకు సంబంధించిన హక్కులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ బాధిత రైతులు ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే నిర్వహించి, భూముల హద్దులను స్పష్టంగా గుర్తించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.