ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలి
ప్రతి కేంద్రంలో రోజుకు 150కి పైగా దరఖాస్తులు నమోదు చేయాలి
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
భవన నిర్మాణ అనుమతులకు ముందు క్షేత్రస్థాయిలో సెట్‌బ్యాక్‌ల పరిశీలన తప్పనిసరి
బల్దియా కమిషనర్ టి.వెంకన్న
హన్మకొండ :ప్రతినిధి తెలంగాణ కెరటం నవంబర్ ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో రోజుకు కనీసం 150కి పైగా దరఖాస్తులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు, పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరా, భవన నిర్మాణ అనుమతుల పురోగతిపై అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 కేంద్రాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆర్‌ఐలకు కేటాయించిన డివిజన్ల వారీగా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బల్దియా ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బీమా నమోదుతో పాటు ఆస్తి, నల్లా పన్నుల వసూళ్లపైనా రెవెన్యూ అధికారులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్ణీత గడువులోగా నమోదు పూర్తి చేసేందుకు అవసరమైతే సాయంత్రం వేళల్లోనూ ప్రత్యేక సమయం కేటాయించాలని సూచించారు.
ఈ నెల 26 నుంచి బల్దియా పరిధిలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెప్మా అధికారుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఇన్‌చార్జి అదనపు కమిషనర్‌కు సూచించారు.
నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏఈలు, డీఈలు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పైపులైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి అరికట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎల్‌నినో ప్రభావం, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
భవన నిర్మాణ అనుమతుల జారీలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించకుండా అనుమతులు జారీ చేయడం వల్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల (ఓసీ) జారీ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. నిర్మాణ దశలోనే నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కమిషనర్ సమ్మయ్య, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, సెక్రటరీ అనిల్ బాబు, ఎంహెచ్‌ఓలు డాక్టర్ రాజేష్, కమల్ చంద్ర, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.