🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 7:41 am Posted by : TELANGANA KERATAM

కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయ్..

News Image

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పులపాలు.. 
అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారు.
వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? కేటీఆర్‌కు నాయిని సవాల్ 

వరంగల్ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 23

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. సోమవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (డీసీసీ భవన్)లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
కేసీఆర్ వంద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, ప్రజలు వందసార్లు ముక్కు నేలకు రాసినా ఆయనను క్షమించే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన కొబ్బరికాయలు కొట్టడం, శిలాఫలకాలు వేయడానికే పరిమితమైందని, నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఆ పార్టీని ఎందుకు ఓడించేవారని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోందని తెలిపారు. ఇందుకు కాళోజీ కళాక్షేత్రమే నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం సుమారు రూ.20 కోట్లతో పిల్లర్లు, స్లాబ్ పనులు చేపట్టి నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని, నిర్మాణ నాణ్యతపై ఎన్ఐటీ నిపుణులతో పరిశీలన చేయించాల్సి వచ్చిందని వివరించారు. భవనం పటిష్టత కోసం మరో రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ ఆ నిధుల వినియోగంపై అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించి, కుడా, పర్యాటక శాఖల సమన్వయంతో కళాక్షేత్రం పనులను ముందుకు తీసుకెళ్లామని, సుమారు రూ.80 కోట్ల నిధులు సమకూర్చి పనులు చేపట్టామని వివరించారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
అదేవిధంగా రింగ్ రోడ్డు పేరుతో గత ప్రభుత్వం హడావుడి చేసి, శంకుస్థాపనలు చేసినప్పటికీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోనే రద్దయిందని విమర్శించారు. వరంగల్ విమానాశ్రయానికి గతంలో 696 ఎకరాల 14 గుంటల భూమి మాత్రమే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 253 ఎకరాల భూమిని సేకరించిందని, ఇందుకోసం రూ.205 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.
నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.550 కోట్లతో వాటర్ వర్క్స్ ఆధునీకరణ పనులు చేపట్టామని, నాలుగు అంగుళాల పైపుల స్థానంలో ఎనిమిది అంగుళాల పైపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పనులు ప్రారంభమయ్యాయని, యూనివర్సిటీ పరిసరాల్లోనూ పైపులైన్లు చేరుకున్నాయని వివరించారు. పాలిటెక్నిక్, ఐటీఐ, మడవీధుల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై పూర్తి ఆధారాలు, జీవోలు, నిధుల కేటాయింపులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని నాయిని సవాల్ విసిరారు. హనుమకొండ చౌరస్తాలోనే చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులను కోరారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులు తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో ప్రజల సమక్షంలో వివరిస్తానన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని, అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు ప్రజల తీర్పును ఎందుకు ఎదుర్కోలేకపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.మాస్టర్ ప్లాన్‌ను సైతం సక్రమంగా అమలు చేయలేని గత పాలకులు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. అభివృద్ధి పేరుతో గతంలో ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని అసంపూర్తిగా వదిలేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.
బీఆర్ఎస్ నాయకులు గతంలో ఇచ్చిన హామీలు, ప్రారంభించిన ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శిలాఫలకాలకే పరిమితమైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేస్తూ వరంగల్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మీ హయాంలో జరిగిన అభివృద్ధిపై మీకు నమ్మకం ఉంటే కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే నాయిని.
ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందించలేకపోయారని విమర్శించారు. నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తోందన్నారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థపై సరైన సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
మహిళల సమస్యలను పరిష్కరించలేని బీఆర్ఎస్ నాయకులు మహిళా సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పదేళ్లలో తెలంగాణను సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన కేసీఆర్, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అదే పరిస్థితి ఎదురవుతుందని విమర్శించారు.
వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో కీలక ముందడుగు వేసిందని, టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. హనుమకొండలో ఐటీ టవర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, స్థల పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారని వెల్లడించారు. కాళోజీ కళాక్షేత్రం రెండో అంతస్తులను కమర్షియల్ కాంప్లెక్స్‌కు అద్దెకు ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవోలు జారీ చేసిందని గుర్తుచేశారు. అప్పుల తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో చైర్మన్ గుండు సుధారాణి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం, హనుమకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home