గూడెం కార్తీక పౌర్ణమి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు....
గూడెం కార్తీక పౌర్ణమి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు....
భక్తుల భద్రతకు ప్రాధాన్యత..
ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.......
తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు......
*మంచిర్యాల:* దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జాతర బందోబస్తు ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గూడెం ఆలయ ప్రాంగణంతో పాటు రాయపట్నం గోదావరి ఘాట్ వద్ద భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు.
జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించాలని సూచించారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా క్యూలైన్లను క్రమబద్ధీకరించాలని, అవసరమైన చోట అదనపు పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.గోదావరి ఘాట్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నదిలోకి భక్తులు వెళ్లకుండా పర్యవేక్షణ చేపట్టడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రక్షణ చర్యలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రధాన రహదారులు, ఆలయ పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భక్తుల భద్రతే పోలీసుల ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్న సీపీ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్తీక పౌర్ణమి జాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సురేష్, దండేపల్లి ఎస్‌ఐ రాజవర్ధన్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.