🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 11:10 pm Posted by : TELANGANA KERATAM

పేరుకే పాటి చెరువు.. మట్టితో నిండిన జలాశయం!

News Image
పేరుకే పాటి చెరువు.. మట్టితో నిండిన జలాశయం!

పూడికతో కుంచించుకుపోతున్న నీటి నిల్వ సామర్థ్యం.. గేట్లు లేక వృథాగా పోతున్న కొద్దిపాటి నీరు

చెరువును లోతుగా తవ్వించి, ఆధునిక మరమ్మతులు చేపట్టాలి.. సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు

జగిత్యాల/బుగ్గారం మండలం, నవంబర్ 24 (తెలంగాణ కెరటం ప్రతినిధి – మేడిపెల్లి గంగాధర్):

ఒకప్పుడు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి ఆధారంగా నిలిచి, వ్యవసాయానికి జీవనాధారంగా ఉన్న యశ్వంతరావుపేట పాటి చెరువు నేడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతోందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పెద్ద చెరువుగా గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరువు నిండా మట్టి పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా వర్షాకాలంలో వచ్చిన నీటిని సైతం పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

హామీలకే పరిమితమైన చెరువు అభివృద్ధి!

ఈ చెరువు సమస్య నేటిది కాదని, గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో మరమ్మతులు జరగలేదని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. చెరువును అభివృద్ధి చేసి, రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపరుస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారని చెబుతున్నారు.

ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి సైతం ఈ సమస్యను తీసుకెళ్లినట్లు రైతులు వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ చెరువు పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గేట్లు లేక నీటి నిల్వకు ఆటంకం.. వృథాగా ప్రవహిస్తున్న జలాలు!

చెరువులో పూడిక పేరుకుపోవడం ఒక సమస్యగా ఉంటే, వచ్చిన కొద్దిపాటి నీటిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన గేట్లు లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహించి వస్తున్న నీటిని చెరువులో నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో నీరంతా దిగువ ప్రాంతాలకు వృథాగా వెళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తుంటే, మరోవైపు అందుబాటులోకి వచ్చిన నీటిని సైతం ఒడిసిపట్టుకోలేని పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించాలి.. రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి!

యశ్వంతరావుపేట పాటి చెరువు దుస్థితిపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చెరువును పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించాలని, చెరువులో పేరుకుపోయిన పూడికను పూర్తిస్థాయిలో తొలగించి లోతు పెంచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అంతేకాకుండా చెరువు కట్ట, తూములు, గేట్ల పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, నీటిని నిల్వ చేసుకునేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, భవిష్యత్తులోనూ రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి యశ్వంతరావుపేట పాటి చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలని, చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి తమ వ్యవసాయానికి సాగునీటి భరోసా కల్పించాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
🏠 Home