రైతుల సమస్యల పరిష్కారానికి నవంబర్ 26న నిరసన
రైతుల సమస్యల పరిష్కారానికి నవంబర్ 26న నిరసన
అమెరికాతో వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి తగ్గాలి.. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 24
హనుమకొండ: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఎన్రెడ్డి హంసరెడ్డి, గొడుగు వెంకట్ డిమాండ్ చేశారు. నవంబర్ 26న హనుమకొండ కాళోజీ సెంటర్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని రైతులు, కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంద సంపత్, ఎం.రమాదేవి, జంపాల రమేష్, బొచ్చు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.