ప్రొబేషనరీ డీఎస్పీలకు పోలీస్ విధులపై దిశానిర్దేశం చేసిన వరంగల్ సీపీ ఎన్.శ్వేత
ప్రొబేషనరీ డీఎస్పీలకు పోలీస్ విధులపై దిశానిర్దేశం చేసిన వరంగల్ సీపీ ఎన్.శ్వేత
హన్మకొండ ప్రతినిధి : తెలంగాణ కెరటం నవంబర్ 24
ఇటీవల డీఎస్పీల నియామకాల్లో ఎంపికైన వారిలో ఐదుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 వారాల పాటు నిర్వహించనున్న ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీపీ ప్రొబేషనరీ డీఎస్పీలతో మాట్లాడి, శిక్షణ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పోలీస్ శాఖ పనితీరుపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణ, నేరాల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో నేర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.
పోలీస్ అధికారి విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత అత్యంత ముఖ్యమని, చట్ట పరిధిలో పనిచేస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.
ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం, భరోసా కల్పించే విధంగా ప్రతి అధికారి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శిక్షణ సమయంలో నేర్చుకున్న అంశాలను భవిష్యత్తులో విధి నిర్వహణలో ఆచరణలో పెట్టాలని సీపీ సూచించారు.
సీపీని కలిసిన ప్రొబేషనరీ డీఎస్పీలలో ధారావత్ సభిత, పల్లేటి సాయి ప్రత్యూష్ రెడ్డి, బుషిరెడ్డి శంతన్ కుమార్ రెడ్డి, రావిరాల యశశ్వినీ, జేరిపోతుల ఆంజనేయులు ఉన్నారు.