మల్లూరు శివాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం
శివనామస్మరణతో మారుమోగిన మల్లూరు శివాలయం.
జ్వాలా తోరణం కార్యక్రమం తో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.
ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24:
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శివాలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా మంగళవారం జ్వాలా తోరణం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా భక్తుల సందడి నెలకొంది. మండలం లోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో శివభక్తులు మల్లూరు శి వాలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు భక్తులకు ప్రత్యేక పూజలు,అభిషేక కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు వెలిగించిన కార్తీక దీపాలతో భక్తి వాతావరణం నెలకొంది. భక్తుల శివనామస్మరణ, హరహర మహాదేవ,శంభో శంకర నినాదాలతో మల్లూరు శివాలయం మారుమోగింది. కార్తీక మాసంలో శివారాధన, దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కుటుంబ సమేతంగా శివాలయానికి చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించి, స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా జ్వాలాతోరణం కార్యక్రమం భక్తులకు విశేష అనుభూతిని కలిగించింది. మల్లూరు ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తులతో కళకళలాడడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తి,సంప్రదాయం, జ్వాలా తోరణం కార్యక్రమం వైభవం కలగలిసిన కార్తీక దీపోత్సవం మల్లూరు లో వైభవంగా సాగింది.