సేవ చేయడంలో ఎంతో తృప్తి..! -విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ -వ్యాపారవేత్త తడకమడ్ల శ్రీనివాస్ గుప్తా
దుబ్బాక, నవంబర్ 25:(తెలంగాణ కెరటం)
పేదలకు, విద్యార్థులకు సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కనీసం 20 శాతం పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని వ్యాపారవేత్త తడకమడ్ల శ్రీనివాస్ గుప్తా అన్నారు.బుధవారం తన తల్లిదండ్రులు కిస్తమ్మ–విశ్వనాథం 14వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గంభీర్‌పూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజనం చేసేందుకు ప్లేట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎంతో మానసిక తృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మేర పేదలకు, నిరుపేద విద్యార్థులకు సహాయం అందించాలని కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ర్యాంకులు సాధించి, తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణాల సునంద–శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కరికె రాములు, అస రాజు, చేపూరి పరుశురాం గౌడ్, కనకయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.