మహిళా నాయకురాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం..
మహిళా నాయకురాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం..
డాక్టర్ భోగ శ్రావణిపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదు
రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెబుతాం
ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఇటీవల చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, అనుచిత విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి జిల్లా నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..డాక్టర్ భోగ శ్రావణి రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదుగుతూ, ప్రజల కోసం పనిచేస్తున్న మహిళా నాయకురాలు అని పేర్కొన్నారు. ఆమె రాజకీయ నిర్ణయాలను, విధానాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది కానీ, రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం, ఒక మహిళా నాయకురాలి గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. రాజకీయాలు చేయండి కానీ వ్యక్తిగత దూషణలు చేయకండి అంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్యకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన మీరు మహిళా నాయకురాళ్ల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం ఏ రాజకీయ సంస్కృతికి నిదర్శనం అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ప్రజలకు మీ గత రాజకీయ ప్రయాణం గురించి అనేక విషయాలు తెలుసని, ఒకప్పుడు జీవన్ రెడ్డితో కలిసి రాజకీయాల్లో పనిచేసిన మీరు, రాజకీయ విభేదాల సమయంలో ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయని ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిపై ఉన్న రౌడీ షీట్ ఎందుకు తీసివేయడం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కోదండ రామాలయ భూముల వ్యవహారంలో ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి భర్త సమిండ్ల శ్రీనివాస్ భూ కబ్జా చేసాడని, జీవన్ రెడ్డితో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న మీరు..ప్రస్తుతం వారితోనే చెట్టపట్టాలు వేసుకొని తిరగడాన్ని జగిత్యాల జిల్లా ప్రజలు గమనిస్తున్నారన్నారు. కందన్ గురించి మాట్లాడే మీరు ఆ వ్యవహారంపై మీ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాత్ర ఏమిటో చెప్పాలన్నారు. 2014 వరకు టీఆర్ఎస్ పార్టీతో, తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని మీకు జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడానికి అప్పటి జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు తాటిపర్తి శరత్ రెడ్డి కాదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ భోగ శ్రావణి బీజేపీ సభ్యత్వం తీసుకునే ముందే టీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన కౌన్సిలర్ అని, మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాతనీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. మహిళలు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు వారిపై వ్యక్తిగత విమర్శలు జరుగుతుంటే వాటిని ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీసీ మహిళా నాయకురాల్లు అయిన భోగ శ్రావణి, ఆడువల జ్యోతి, దావా వసంతల పైన చేసిన వ్యక్తిగత విమర్శలకు ఇది కొనసాగింపు అనుకోవాలా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీలోని మహిళా నాయకురాళ్లతో పాటు ఇతర పార్టీల మహిళా నాయకురాళ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు మా దృష్టికి వచ్చాయని, ఈ వ్యవహారంపై సంబంధిత నాయకులు స్పష్టత ఇవ్వాలన్నారు. మహిళలపై ఎవరైనా అసభ్యకరమైన లేదా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే బాధితులు చట్టపరంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని, అలాంటి సందర్భాల్లో వారికి న్యాయం జరిగేలా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందన్నారు. పొలాస గ్రామంలో భూముల వ్యవహారాలు, గ్రామపంచాయతీ బిల్లుల చెల్లింపులు, రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలు, గతంలో నమోదైన కేసుల విషయాలపై కూడా సంబంధిత అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, ఈ అంశాలపై గాజంగి నందయ్య ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలన్నారు. డాక్టర్ భోగ శ్రావణిపై నందయ్య చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై, మీ రాజకీయ ప్రయాణం, మీరు చేసిన గత వ్యాఖ్యలు, మహిళా నాయకురాళ్లపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెబుతాం..కానీ వ్యక్తిగత దూషణలు, మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను మాత్రం ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపల్లి సత్యం, ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శులు బన్న సంజీవ్, బీజేపీ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముద రాజు, ఇట్యల రాము, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ శ్రవణ్ కుమార్, జిల్లా కార్యదర్శులు గూనుకొండ నరేష్, బెత్తెపు నర్సయ్య, ఎస్సీ మోర్చా జగిత్యాల పట్టణ అధ్యక్షులు నక్క జీవన్, తదితర బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు పాల్గోన్నారు.