🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 7:41 pm Posted by : TELANGANA KERATAM

రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించాలి!

News Image
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించాలి!

రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ – డాక్టర్ తాటికొండ రాజయ్య

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26 

రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలోనే గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అనే ప్రాథమిక విలువలను అందించింది. కానీ నేడు దేశంలో రాజ్యాంగ పరిరక్షణ గురించి గొప్పగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రతినిధుల నైతిక బాధ్యతను కాపాడేందుకు నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూల్) అమల్లోకి వచ్చింది. అలాంటి చట్టాన్ని నేడు కాంగ్రెస్ నాయకులే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం విడ్డూరం అని తెలిపారు. ఒకవైపు రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రసంగిస్తుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే రాజకీయాలకు పాల్పడుతోంది. ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెబుతున్న రాజ్యాంగ పరిరక్షణ అని ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకోవడం గొప్ప కాదు.. అందులోని విలువలను ఆచరించడమే నిజమైన గౌరవం. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్ని గౌరవించలేని కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమే అని అన్నారు. ప్రజలు ఒక పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే, ఆ ప్రజాతీర్పును గౌరవించకుండా పార్టీలు మారడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగబద్ధమైన విచారణ జరిపి, చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత రాజ్యాంగ వ్యవస్థలపై ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ద్వంద్వ వైఖరిని విడనాడి, రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నాను. అంబేద్కర్ ఆశయాలు ప్రసంగాల్లో కాదు.. పాలనలో కనిపించాలి. రాజ్యాంగం నినాదాల్లో కాదు.. ఆచరణలో నిలవాలి. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home