రైతు, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం
రైతు, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం
ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలి – సంయుక్త కిసాన్ మోర్చా
హనుమకొండ:ప్రతినిధి తెలంగాణ కెరటం నవంబర్ 26
దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా హనుమకొండ కాళోజీ సెంటర్‌లో రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొడుగు వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం లాభదాయక ధరలు నిర్ణయించాలని కోరారు. రైతులకు సమగ్ర రుణమాఫీ అమలు చేయడంతో పాటు, రైతు కుటుంబాలకు నష్టపరిహారం, పెన్షన్, బీమా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, రైతుల భూములకు రక్షణ కల్పించాలని కోరారు. కరువు, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణమే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎన్.రెడ్డి హంసారెడ్డి, సారంపెల్లి వాసుదేవరెడ్డి, రాగుల రమేష్, సుంచు రాజేందర్, ఎం. రమాదేవి, ఓరుగంటి సాంబయ్య, టి.ఉప్పలయ్య, మంద సంపత్, వేల్పుల రమేష్, కాడబోయిన లింగయ్య తదితర రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.