ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాటికాయల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, సీనియర్ పాత్రికేయులు బొల్లెపాక రాజేష్, యువజన సంఘాల నాయకుడు పట్ల ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ వారిలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వ భావనలను పెంపొందించే లక్ష్యంతో ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను విద్యార్థులు చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకొని విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. సీనియర్ పాత్రికేయులు బొల్లెపాక రాజేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, న్యాయం కల్పించాలనే గొప్ప ఆశయంతో రాజ్యాంగం రూపుదిద్దుకుందని తెలిపారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను, ప్రజాస్వామ్య విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల నాయకుడు పట్ల ప్రవీణ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటి ప్రాముఖ్యతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం వెల్లివిరిసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సీనియర్ పాత్రికేయులు బొల్లెపాక రాజేష్ ఆధ్వర్యంలో అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించేలా బహుమతులు అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు అంబేద్కర్ ఆశయాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల చైతన్యాన్ని నింపింది అని తెలిపారు. పోటీల విజేతలు చిత్రలేఖనం పోటీల్లో సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిని శివసాయి, ద్వితీయ బహుమతిని సాయి రిషిక్, తృతీయ బహుమతిని ప్రతిభ అందుకున్నారు. జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిని శ్లేషా, ద్వితీయ బహుమతిని సాయికుమార్, తృతీయ బహుమతిని శివానందు కైవసం చేసుకున్నారు. రాజ్యాంగ ప్రవేశిక పఠన పోటీలో ప్రథమ బహుమతిని శ్రవంతి, ద్వితీయ బహుమతిని రుత్విక, తృతీయ బహుమతిని చరణ్య సాధించారు. వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతిని హాస్య, ద్వితీయ బహుమతిని అక్షయ, తృతీయ బహుమతిని అవంతిక అందుకున్నారు.