అధిక వడ్డీ, అక్రమ చిట్టీ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు వడ్డీల పేరుతో వేదిస్తే కఠిన చర్యలు తప్పవు.... జిల్లా ఎస్పీ నితికా పంత్.
16 కేసులు నమోదు.. 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్‌బుక్‌లు స్వాధీనంl

తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు.కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టీ నిర్వాహకులపై జిల్లా పోలీసులు కొరడా ఝళిపించారు. రైతులు, సామాన్య ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ, చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా 57 మంది అధిక వడ్డీ వ్యాపారులు, చిట్టీ నిర్వాహకుల ఇళ్లలో పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా వడ్డీ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, చిట్టీ రికార్డులు, ప్రామిసరీ నోట్లు, చెక్‌బుక్‌లు తదితర కీలక పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదు చేసి, 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఆర్థిక లావాదేవీలపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ.. అధిక వడ్డీల పేరుతో రైతులు, సామాన్య ప్రజలను ఆర్థికంగా వేధించడం, బెదిరింపులకు పాల్పడటం, చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అధిక వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురైన బాధితులు భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, బాధితులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారులు, చిట్టీ నిర్వాహకుల కార్యకలాపాలు గుర్తించినా, ప్రజలను వేధిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ప్రజల ఆర్థిక భద్రతే లక్ష్యంగా అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టీ నిర్వాహకులపై నిఘా, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో జిల్లా పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.