కోక్యాతండాలో అధికార పార్టీ సర్పంచ్ ఒంటెద్దు పోకడ..!!
అనుమతి లేకుండా పంచాయితీ భవనం కూల్చివేత
పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 37 ఉల్లంఘన
ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డగించిన గ్రామస్తులు
ఎంపిడిఓ తీరు పై ప్రజల్లో సర్వత్రా విమర్శలు
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఖమ్మం , నవంబర్ 27 (తెలంగాణ కెరటం ) : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా పారదర్శకమైన పాలన చేపట్టాల్సిన గ్రామ సర్పంచ్ తన పదవిని దుర్వినియోగం చేశాడు.ప్రభుత్వం నుండి అధికారిక అనుమతి(ఆర్డర్)లేకుండానే ఏకంగా పంచాయితీ భవనాన్నే కూల్చివేసి తీవ్ర దుమారానికి తెరలేపాడు.కూసుమంచి మండలంలోని కోక్యాతండాలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ఒంటెద్దు పోకడలు గ్రామంలో వివాదాస్పదంగా మారాయి.అధికార పార్టీ సర్పంచ్ ను,నేను చెప్పిందే వేదం,నామాటకు లేదు ఎదురు అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గౌరవ ప్రదమైన సర్పంచ్ పదవికే కళంకం తెస్తున్నాడు.ప్రజల పరిపాలనకు కేంద్రమైన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని ఏకపక్ష నిర్ణయాలతో కూల్చివేసే యత్నం చేయడంతో కొందరు గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.మంచి స్థితిలో ఉన్న భవనాన్ని కూల్చివేయడం ఎందుకని సర్పంచ్ ను నిలదీశారు.కొత్తగా మంజూరైన భవనాన్ని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో విశాలంగా నిర్మించి,దృఢంగా ఉన్న పాత భవనాన్ని గ్రంథాలయం,అంగన్వాడి, గ్రామపాలన అధికారి(జిపిఓ) తదితర కార్యాలయాలుగా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.వ్యక్తిగత స్వలాభం కోసం మంచిగా ఉన్న పంచాయితీ భవనాన్ని కూల్చివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో సర్పంచ్ చేసేదేంలేక కూల్చివేత పనులను మధ్యలోనే ఆపేసి అక్కడి నుండి జారుకున్నాడు.నివేదికలు లేవు..నిబంధనలు వర్తించవు..?

పంచాయితీ భవనం కూల్చివేసేందుకు నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ అధికారుల పరిశీలన,స్థితిగతుల పై నివేదిక,అవసరమైన పరిపాలన అనుమతులు,జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులుతప్పనిసరిగాతీసుకోవాలి.కానీ...కోక్యతండాలో ఎలాంటి అనుమతులు లేకుండానే సర్పంచ్ పంచాయితీ భవనాన్ని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం మండల ప్రజల్లో తీవ్ర చర్చగా మారింది.