సర్వే నెం.1490 లో అక్రమ లేఅవుట్ పై బిజెపి నేతల ఫిర్యాదు
సర్వే నెం.1490 లో అక్రమ లేఅవుట్ పై బిజెపి నేతల ఫిర్యాదు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : కోరుట్ల పట్టణంలోని సర్వే నెం.1490 లో అనధికార అక్రమ లే అవుట్ లో విక్రయాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరుతూ, కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు, 11,వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం అధికారులకు ఫిర్యాదు చేశారు. కోరుట్ల పట్టణంలోని అయిలాపూర్ రోడ్ పరిధిలో గల సర్వే నెంబర్ 1490, దాని సబ్ డివిజన్లలోని 4.12 ఎకరాల భూమిలో ఎలాంటి అధికారిక తెలంగాణ మున్సిపల్ చట్టం-2019, లే-అవుట్, డీటిసిపి, రెరా అనుమతులు లేకుండా అనధికార వెంచర్ ఏర్పాటు చేసి, అక్రమ ప్లాట్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని కోరుట్ల ఆర్డిఓ, తహశీల్దార్, మున్సిపాలిటీ, సబ్ రిజిస్ట్రార్ అధికారులకు కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు, 11,వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ ఇందురి తిరుమలవాసు, మాడవేని నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాకల గణేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కస్తూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఈ అనధికార అక్రమ లే అవుట్ ఏర్పాటు వల్ల కోరుట్ల మున్సిపాలిటీకి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడడంతో పాటు అమాయక కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే ఈ అనధికార అక్రమ లే అవుట్ వల్ల రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, మార్టిగేజ్ నిబంధనలు పాటించకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చెయ్యడం వల్ల తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 (సెక్షన్-172), డిటిసిపి నిబంధనలు, రెరా నియమాలు, రిజిస్ట్రేషన్ చట్టం-1908 (సెక్షన్-81) ఉల్లంఘన జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో కోరుట్ల తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, సర్వే నెం: 1490, దాని సబ్ డివిజన్లలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగకుండా, అక్రమ నిర్మాణాలు తొలగించాలని అక్రమ వెంచర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కస్తూరి లక్ష్మీనారాయణ అధికారులను కోరారు.