వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై.అనూప్ రావు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : కోరుట్ల పట్టణంలో వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, బిజెపి పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, బిజెపి మండల అధ్యక్షులు పంచరి విజయ్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మామిడి మల్లేష్ రెడ్డిల ఆధ్వర్యంలో శనివారం కోరుట్ల ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై.అనూప్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించినప్పటికీ, నెల రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని విమర్శించారు. రైతులు తమ వరి ధాన్యాన్ని కల్లాల్లోనే పోసుకొని, నెల రోజులుగా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి, రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మామిడి మల్లేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటల సాగులో భాగంగా ఏడు రకాల పంటలను సాగు చేయాలని రైతులకు సూచించిందని, ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు పండించి ధాన్యాన్ని కల్లాలకు తరలించినప్పటికీ నెల రోజులుగా కొనుగోళ్లు జరగడం లేదని తెలిపారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల తుకారం గౌడ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విటల్ రాజేందర్ రెడ్డి, ఎండోమెంట్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు తులసి కృష్ణ, కోరుట్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్, మ్యాకల గణేష్, ఉపాధ్యక్షులు మైదం సత్యనారాయణ, పట్టణ కార్యదర్శులు చెట్పల్లి ఓం ప్రకాష్, బాల్క ప్రేమ్ సాగర్, దళిత మోర్చా అధ్యక్షుడు బెక్కం అశోక్, మాజీ సర్పంచ్ తోట లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఏలేటి రాజారెడ్డి, పట్టణ బీజేవైఎం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి, మండల బీజేవైఎం అధ్యక్షులు వెంకట్ రెడ్డి రాజు, కోరుట్ల పట్టణ, మండల బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.