🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 29 November 2026, 9:02 am Posted by : D RAMAKRISHNA

ఎవని పాలవుతోంది తెలంగాణ..!!

News Image

ఎవని పాలవుతోంది తెలంగాణ..!!


  • స్వ రాష్ట్రంలోనూ అందని ఫలాలు..
  • నీళ్లు, నిధులు, నియామకాలు పరాయి పాలు 
  • ఆస్తులు పెంచుకునే పనిలో తెలంగాణ పాలకులు 
  • ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులకు మొండి చేయి
  • దీక్ష దివాస్ సందర్భంగా ఖమ్మం సబ్ జైల్ ఎదుట ఉద్యమకారుల నిరసన

  • తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య 


తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు...  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక నిర్ణయాన్ని తీసుకునేలా చేసిన రోజు... వలస పాలనను తరమాలని మూడు కోట్ల ప్రజలు ఉవ్వెత్తున గొంత్తెత్తిన రోజు.. చరిత్రలో నిలచిన రోజు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ జరుపుకునేదే దీక్ష దివస్.. నాటి తమ త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. తెలంగాణ ఫలాలు ఉద్యమకారులకు, అమర వీరుల కుటుంబాలకు అందాలని డిమాండ్ చేస్తూ..  ప్రతీ ఏటా ఖమ్మం జిల్లాలోని ఉద్యమకారులు ఖమ్మం సబ్ జైల్ వద్ద వినూత్న నిరసనను తెలుపుతున్నారు.

ఖమ్మం, నవంబర్ 29: ఎవరూ నిర్వహించని విధంగా వినూత్నమైన రీతిలో నిర్వహించి ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం 7 గంటలకే ఖమ్మం సబ్ జైల్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య అనేక అంశాలను ప్రస్తావించారు. 
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా నీళ్లు, నిధులు, నియామకాల కోసం అవస్థలు పడాల్సిన దుస్థితి నేడు ఏర్పడింది.. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఇంకా నీళ్ల కోసం మైళ్ళ  దూరం నడవాల్సిన దుస్థితి.. వేసవి రాకముందే హైదరాబాద్ లాంటి నగరాల్లో నీళ్ల కోసం టాంకర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కళ్లారా చూస్తున్నాం. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల కోసం లక్షల కోట్లు వెచ్చించి కట్టుకున్న సాగునీటి  ప్రాజెక్టులన్ని పరాయి రాష్ట్రాలకు నీళ్లను తరలించే వాహకాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా సరిగా నీళ్లను అందించలేని ఈ ప్రాజెక్టులు ఎవరికోసమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నప్పటికీ పాలకుల్లో ఎలాంటి చలనం లేకుండా పోతుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి కంటే రాష్ట్రం విడిపోయాకే తెలంగాణ నీళ్లను విపరీతంగా తరలించుకుపోతున్నారనేది నగ్న సత్యం. పాలకులు ఎవరైనా సరే పక్క రాష్ట్రాలకు గేట్లను బార్లాగా తెరుస్తుంటే, ఎలాంటి ఆంక్షలు విధించకుంటే, పంటలకే కాదు జనం తాగడానికి కూడా చుక్క నీరు దొరికే పరిస్థితి భవిష్యత్తులో ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఆదాయ వనరులు ఉన్న ప్రాంతం తెలంగాణ అయితే తెలంగాణ ప్రాంతంలో వస్తున్న ఆదాయ వనరులు వేరే ప్రాంతాలకు ఖర్చు చేయడం అది తెలంగాణ ప్రజలను తీవ్రంగా కలచివేసిన అంశం. మన నిధులు మనకే కావాలని మన దగ్గర వచ్చే ఆదాయాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి మన రాష్ట్ర ప్రయోజనాలకు ఖర్చు చేయాలని అనేకమంది తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ నినాదాన్ని బలంగా వినిపించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా మన నిధులు మనకే కేటాయించబడతాయని భావించిన తెలంగాణ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రాజెక్టు, ప్రతి కాంట్రాక్టు ఆంధ్ర కాంట్రాక్టర్ల  పాలవుతున్నాయి. చిన్నపాటి డ్రైన్ల నిర్మాణం నుంచి మొదలుకుంటే ఆఖరికి కాలేశ్వరం ప్రాజెక్టు వరకు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లది అందవేసిన చేయి. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇక్కడి నిధులను ఆంధ్ర కాంట్రాక్టర్ల పాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయనకు నేనేమి తీసిపోనంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అక్కడి కాంట్రాక్టర్లకే ఇక్కడ నిర్మించే ప్రతి ప్రాజెక్టును అప్పగిస్తున్న వైనం . ఈ విషయాలను ప్రశ్నించే వాళ్లను అరెస్టు చేస్తున్న దుస్థితి నేడు మన సొంత రాష్ట్రంలో దాపురించిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. మన నిధులతో అనేకమైన కంపెనీలు మన నేలపైనే స్థాపించినప్పటికీ ఆ కంపెనీల్లో అత్యధికంగా పనిచేసేది ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వ నియామకాలు సరే కనీసం ప్రైవేట్ రంగంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న యువతకు అరకొర ఉద్యోగాలు లభిస్తున్నాయంటే ఇక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు అసలు స్వరాష్ట్రం వచ్చిందో లేదో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. రోజురోజుకు నిరుద్యోగ యువత రాష్ట్రంలో పెరిగిపోతుంటే వలసవాదుల దాడి మరింతగా జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాని కంటే రెట్టింపు పరిస్థితులు రాబోతున్నాయని తెలంగాణ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రాలను పరిపాలించాల్సిన ముఖ్యమంత్రులు ఇప్పటికీ మన రాష్ట్రంలో వారి అజమాయిషి చలాయిస్తున్నారంటే మన పాలకులు ఎలా ఉన్నారో ప్రతి తెలంగాణ వాది ఆలోచించాల్సిన అంశం. 

 కెసిఆర్ చేసిన తప్పులే మీరు చేయకండి... 


కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలను నీళ్లల్లో పోసినాడు... ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పేరుతో, అందాల పోటీలు, ఫ్యూచర్ సిటీ పేరుతో ఇలా అనేకమైన ప్రజలకు ఉపయోగపడని కార్యక్రమాలను చేపట్టి ప్రజాధనాన్ని వృధా చేయవద్దు. తెలంగాణ నీళ్లను నాడు జగన్మోహన్ రెడ్డి తరలించకపోతుంటే.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లప్పగించి చూశాడు.. అదే పని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయవద్దు నాగార్జునసాగర్ నుంచి నీళ్లను అప్పనంగా తరలించకపోవడానికి భారీ స్థాయిలో టన్నల్స్ ను ఏర్పాటు చేస్తుంటే చీమకుట్టినట్టు కూడా ఈ ముఖ్యమంత్రి కి లేదని అనేకమంది భావిస్తున్నారు. గత తప్పిదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేటి ముఖ్యమంత్రి తన పరిపాలన కొనసాగించాలని సూచిస్తున్నాం.

 ఉద్యమకారులకు, అమరవీరుల తల్లిదండ్రులకు మొండి చెయ్యి.. 


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడిన తెలంగాణ ఉద్యమకారులు స్వరాష్ట్రంలో కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి నేడు ఏర్పడింది. తొలీ మలిదశ ఉద్యమాల్లో పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడి, తలకాయలు పగలగొట్టుకున్న సర్వాన్ని కోల్పోయిన ఉద్యమకారులు నేడు వారి బతుకులు రోడ్డున పడ్డాయి. కనీసం వారిని ఆదుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని పాలకులు నేడు తెలంగాణను పరిపాలిస్తున్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఒకరు, ఉరి వేసుకుని మరొకరు, రైలు కిందపడి ఇంకొకరు ఇలా అనేక మంది విద్యార్థులు, తెలంగాణ ప్రేమికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం రక్త తర్పణం చేశారు. తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు నేడు వృద్ధాప్యంలో ఒక్క ముద్ద అన్నం కోసం ఇతరుల మీద  ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు పెట్టేవాడు లేక గుడ్డలిచ్చేవాడు లేక నిలువనీడ లేక ఆ వయోవృద్ధులు ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొంత నగదును చిన్నపాటి ఉద్యోగాలను విదిల్చి చేతులు కడుక్కుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యమకారులను ఆదుకోవాలని అమరవీరుల తల్లిదండ్రులను అక్కున చేర్చుకోవాలని దీన్ని కాలయాపన చేయకూడదని మేధావులు తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు. 

కమిటీలతో కాలయాపన వద్దు: 


కెసిఆర్ కుటుంబ పాలన చేసి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీసేలా చేశాడు.. నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లయిన కనీసం ఉద్యమకారుల కోసం ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. మూడేళ్లుగా అనేక ఉద్యమ సంఘాలు తమ గళాన్ని వినిపించడంతో ఎట్టకేలకు దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేకే కమిటీ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీల పేరుతో కాలయాపన చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మేధావులు, విద్యావంతులు భావిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా అర్హులైన ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి అమరవీరుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీల ప్రకారం న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
ఈ కార్యక్రమంలో పాలకుర్తి కృష్ణ, కుక్క సత్య, తునికిపాటి లక్షణ చారి, వడ్తియా రాజేష్ నాయక్, వడ్దెబోయిన వెంకటేశ్వర్లు, కాలింగ్ గురువయ్య, తోట వెంకట నారాయణ, వుల్లోజు వెంకన్న, బొలికొండ పాపయ్య, రామాంజనేయులు, మీగడ రామారావు, బోనగిరి నర్సింహారావు, కూరపాటి కృష్ణ మూర్తి, రామ్మూర్తి, మంగీలాల్, గుమ్మ సీతమ్మ, తుడుం వీరబాబు, ఎల్.రామస్వామి, ఉల్లంగి పద్మ, అరుణ, మేరే నాగయ్య, వెంకటప్పయ్య, దెప్ప వెంకటేశ్వర్లు, లక్క పుల్లయ్య, ధనమ్మ, బిందె వెంకన్న అంబాల రామారావు, బొలికొండ వీరభద్రం, వెకంటరత్నం తదితరులు పాల్గొన్నారు.
Additional News Photo Additional News Photo Additional News Photo
🏠 Home