ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు. స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.
తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 7:
మంగళవారం ,ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హవేలీఘనాపూర్ మండలంలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పలు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ. టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, అనే థీమ్‌ను ప్రస్తావిస్తూ, ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.ఆరోగ్యం అనేది కేవలం వ్యాధుల లేమి మాత్రమే కాకుండా శారీరక,మానసిక, సామాజిక సంక్షేమం కలగలిపిన సమగ్ర స్థితి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను తప్పనిసరిగా అలవరచుకోవాలని సూచించారు.ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి, మిల్లెట్ ఆహారం, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని పేర్కొన్నారు.అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులను అనుసరించాలని తెలిపారు.సీజనల్ వ్యాధులు,జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోతహసిల్దార్ ,స్థానిక సర్పంచ్ ,పిహెచ్సి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

