Saturday, May 23, 2026
HomeUncategorizedకేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

📰 Generate e-Paper Clip

నిర్దోషిగా తేల్చడాన్ని సవాలు చేసిన ఈడీ

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన హాజరుకాకపోవడంతో దాఖలైన కేసుల్లో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ‌ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌కు ముందుగానే నోటీసులు ఇచ్చినా, ఆయన తరఫున ఎవరూ హాజరుకాలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటించడం ద్వారా ట్రయల్ కోర్టు తీవ్రమైన తప్పిదం చేసిందని వాదించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద జారీ చేసిన సమన్లు ఆయనకు అందినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, కేజ్రీవాల్‌కు తాజాగా నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అలాగే, ట్రయల్ కోర్టు రికార్డులను సమర్పించాలని ఆదేశించింది.

గతంలో పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఈడీ జారీ చేసిన ఐదు సమన్లను కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదులను విచారించిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరాస్ దలాల్, కేజ్రీవాల్‌పై విచారణ కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. ఈ తీర్పునే ఇప్పుడు ఈడీ హైకోర్టులో సవాలు చేసింది.

ఇదే సమయంలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు విచారణను జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం నుంచి మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. విచారణ నిష్పాక్షికతపై తనకు సహేతుకమైన అనుమానాలు ఉన్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments